Saturday, March 28, 2020

దేశద్రోహము - నిర్లక్ష్యము

Be Careful - Carelessness Can Hurt You And Others

నేను నా నాలుగో అంతస్థులో కూర్చొని బీరుతాగి, దాన్ని బాల్కనీలోంచి విసిరేశాననుకోండి, అది నెత్తినపడి ఎవరైనా చచ్చారనుకోండి, నామీద మర్డరుకేసు కాదుగానీ, హోమిసైడ్ కేసుపెడతారు. తాగి డ్రైవింగ్ చేసి ఆక్సిడెంట్‌కు గురైనా అంతే! 

మరి క్వారంటైన్ ముద్రలు వేసినా రోడ్లట్టుకు తిరిగే వాళ్ళమీద దేశద్రోహం నేరమో ఇలాగే హోమోసైడో, డెమోసైడో ఎందుకు మోపకూడదు? అసలీ గాడిదలకి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఓ పద్నాలుగురోజులు లాక్ చేసి పారేసి, తిండికూడా ఇవ్వకుండుంటే సరి! తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్లు, వీడికి రోగమొస్తే, దానికి పసికందులు, ముసలాళ్ళు, వాడి రోగం విషయం తెలీక వాడితో తిరిగిన పదులకొద్దీ జనాలు, వాళ్ళ జీవితాలు ప్రమాదంలో పడటమేమిటి? దీనికి ఏ శిక్షా ఉండఖ్ఖర్లేదా? రేపు పరిస్థితి అదుపు తప్పి, మూడో స్టేజిలోకో, నాలుగో స్టేజిలోకో కరోనా చేరుకుంటే, దానికి వీళ్ళు బాధ్యులు కారా? దేశభక్తంటే పాకిస్తాన్ను చెడదిట్టడమేనా? సామాజిక బాధ్యత లేకున్నా ఫర్లేదా? 

వెధవ్వేషాలేసిన మతగురువులు, డబ్బులకు కక్కుర్తిపడి కారుల్లో జనాలను జిల్లాల హద్దులు దాటిస్తున్న కారు డ్రైవర్లు, రోడ్లు ఖాళీగా ఉన్నాయని బండ్లేసుకొని రోడ్లెక్కుతున్న అజీర్తి వెధవలు, బంధువుల్ని క్వారంటైన్‌లోంచి తీసుకువెళ్ళి, ఇంకొందరికి రోగాన్నంటించుకొచ్చిన వీఐపీలు, వార్డుల్లోంచి పారిపోయినవారు, వాట్సాపుల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నవారు. అందరికీ కనీసం ఒక ఏడేళ్ళు వేసి, ఆస్తులు జప్తుచేస్తే తిమ్మిరణుగుతుంది వెధవలకి. అంతటి నిర్లక్ష్యమా? జనాలున్ ఒకపక్క చనిపోతూ ఉంటే వీళ్ళకి fun కావల్సొచ్చిందా?

విదేశాలకెళ్ళినవాళ్ళు ఇంకోజాతి. విద్యార్ధులంటే ఏదో అనుకోవచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళూ, గ్రీన్ కార్డులున్నోళ్ళూకూడా, అక్కడేమైనా ఐతే, ఇండియాకెళ్ళడం. ఇండియాలో ఏమైనా ఐతే మళ్ళీ విదేశాలకు పరిగెత్తడం. అంటే వీళ్ళు ఏ సమాజానికీ చెందరా? ఏ సమాజం పట్లా వీళ్ళకి బాధ్యత ఉండదా? ఎక్కడా firmగా నిలిచి చుట్టుప్రక్కలున్న మనుషులకి సహాయం చెయ్యడమో, మానసిక స్థైర్యాన్ని కలిగించడమో చెయ్యఖ్ఖర్లేదా? పరాన భుక్కులుగా జీవించడమే వీళ్ళ జీవితమా? ఇలాంటి సన్నాసుల్ని విమానాల్లో తెచ్చిమరీ రోగాలు విస్తరింపజేసుకోవడం ఎందుకు?

తాగుబోతులు. నిజమే ఆల్కహాల్ త్రాగడాన్ని హఠాత్తుగా ఆపితే మనుషులు చనిపోతారుకూడా. కానీ అది చాలా పెద్దమొత్తాల్లో అందునా రోజూ త్రాగేవారికి మాత్రమే వర్తించే విషయం. సారా దొరకట్లేదని ఆత్మహత్య చేసుకొనే వాళ్ళంతా ఇదే బాపతు. అంటే వీళ్ళు రోజంతా నిషాలో ఉంటారన్నమాట. వీళ్ళవల్ల వీళ్ళ కుటుంబాలకైనా ఏమిలాభం? సారా త్రాగిన తరువాత వాడు బుధ్ధిగా ఇంట్లోనే ఉంటాడనటానికి ఏంటి ఆధారం? అసలు వీళ్ళకి ఇంతలా ఎందుకు అలవాటయ్యింది? ఇప్పుడు వీళ్ళలో ఒకరికి కరోనా వస్తుందనుకుందాం... అప్పుడు వాడికి మందులతోపాటూ ఒక ఫుల్‌బాటిల్ విస్కీకూడా  ఇప్పిస్తారా ఆసుపత్రిలో?! ఏం ఫర్లేదు సారాయికోసం చచ్చేవాళ్లను చావనివ్వండి. ఏదో సరదాకి త్రాగారంటే సరేగానీ, అదిలేకుండా బ్రతకలేని స్థితికి వస్తే అలాంటివాళ్ళు అఖ్ఖర్లేదు.