Monday, June 24, 2019

సమ్మోహనం

Image result for sammohanam
ఈ మధ్య నేను చూసిన తెలుగు సినిమాల్లో నాకు బాగా నచ్చిందిది. అదితీరావ్ హైదరీని తెలుగులో చూడ్డం నచ్చింది. అమె నటనగురించి కొత్తగా చెప్పాల్సిందేమీలేదు. ఇంతకుముందు చూసిందే. భావాలు పలుకుతాయి మొహంలో, కళ్ళలో. అది చాతగాకనే గుడ్డలిప్పుకొని గెంతాల్సొస్తుంది హీరోయిన్లకు. ఈ సో కాల్డు సుధీర్‌బాబు మహేశ్‌బాబుకి బంధువట. కానీ మహేశ్‌బాబుకంటే చాలారెట్లు మెరుగు. మన ఖర్మేంటంటే ఇలా సెన్సిబుల్‌గా నటించేవాళ్ళు, సెన్సిబుల్ సినిమాలు ఎంచుకొనేవాళ్ళు మనకు నచ్చరు. పిడిగుద్దుతో పాతికమందిని పడగొడితే అదీ మనకు హీరోయిజం. "తమ్ముడూ... నువ్వు సినిమా ఎన్నిసార్లు చూశావమ్మ...?" అనడిగినప్పుడు సుధీర్ బాబు కూల్‌గా చెబ్తాడు "ఒక్కసారేనమ్మా" అని. డైలాగు రాసినాయనకి దండం స్వామీ. భళ్ళుననవ్వి, తరువాత ముక్కులోకి పోయిన నీళ్ళతో అవస్థపడ్డాను. ఇక సీనియర్ నటుడు నరేశ్ నటన ఆద్యంతమూ చఖ్ఖగా ఉంది. నరేశ్‌ని అద్బుతంగా వాడుకున్నారు. ప్రస్తుత కాలపు సినిమాలమీద, డైలాగ్ రైటర్స్‌మీద వేసిన సెటైర్లు బాగున్నాయి. 

ఇది చూశాక ఇంద్రగంటిగారు చేసిన మిగిలిన సినిమాలు చూడాలనిపించింది. మొన్నొకరోజు మాయాబజార్ (2006) చూశాను. సినిమా ఫర్లేదు. అంతకంటే నాకు నోట్ఐన విషయం ఏంటంటే రాజా ఏబెల్ తెలుగు ఉఛ్ఛారణ. చక్కగా ఉంది. ఆయనకి "భ"ని పలకడమేగాక, ఎప్పుడు "బ"ని వత్తాలో, వత్తకూడదో కూడా తెలుసు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు హీరోల్లో చాలా మందికి ఈ బేసిక్ లాంగ్వేజ్‌సెన్స్ లేదు. ఆమధ్య తాజ్‌మహల్ అనబడే చిత్రరాజాన్ని చూస్తుంటే అందులో హీరోగారు "నా బావిజీవితం..." అంటూ ఏదో డైలాగు చెబుతుంటే నవ్వలేక చచ్చాను. ఆ కప్ప వెధవకి "భావి జీవితా"నికీ, "బావి జీవితా"నికీ తేడా తెలియదు. అదన్నమట సంగతి. వాణ్ణికాదు డబ్బింగ్‌లో ఆ డైలాగును ఓకేచేసినోణ్ణి లాగిపెట్టి తన్నాలి.

Sunday, June 23, 2019

సహజ యోగ

మొన్న కురిసిన వానకి నా దగ్గరున్న గాడిదలన్నీ చెదిరిపోవడంతో, గాడిదలు కాసేపనికూడా లేక, ఆదుర్దినాన సహజ యోగ అనబడే ఒక meet upకి వెళ్ళి చచ్చాను. ఏడున్నరకి మొదలవ్వాల్సింది, ప్రొజెక్టరుగారి, మరియు ఆడియోసిస్టంగారి ఆశిర్వాదంతో ఎనిమిదికి మొదలయ్యింది. ఆవిడెవరో "ష్రీమాటజీ" అట. ఆవిడ భక్తుడు "ప్రేం" అట (అతని అసలు పేరు పీటర్. ఇండియాలో మతమ్మారాక "ప్రేమ" అనే పేరు ఏ పామేలానో, పెట్రానో అవుతుంది. ఇక్కడ రివర్సు). ముందుగా వీడియోల్లో యోగాసనాల్నీ, ఖేచరీ యోగాన్నీ ఖండించారు (సంతోషం. వేమనకూడా "ఆసన యోగంబు అధమయోగంబు" అన్నట్లు గుర్తు). ఇహ నా సామిరంగా "పటాంజలి" యోగ సూత్రాల్ను వివరిస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఇక అదంతా అయ్యాక "చాక్రా"స్  గురించి వివరించారు. అన్నట్లు మాస్టారు "కుండలీని" (అనగా కుండలిని) మూలాధారంవద్ద చుట్టచుట్టుకొని ఉంటుందన్న వాదనే చాలామంది సంప్రదాయవాదులకి కోపంతెప్పించింది అంటారు. వీళ్ళేమో దాన్నే ఫాలో అయిపోయారు. గురువు ప్రేం గారికి చాక్రాస్ పేరు పలకడమే రాలేదు. "నేములోనేముంది?" అనుకొని ముందుకు కదిలినా తరువాత జరిగిన ధ్యానప్రక్రియ నవ్వు తెప్పించింది. 

గురువుగారు కళ్ళుమూసుకొని ఒక్కొక్క చాక్రాపై చేతినుంచుకొని (మీద చేతులుముకొని మంత్రాలు చదివే చాక్రాస్‌లో మూలాధార చాక్రా లేదు. ఎందుకోమరి?), మంత్రాలు వాడి నోటికి ఏ నంబరొస్తే అన్నిసార్లు మంత్రాన్ని చదవమన్నాడు. అందులో ఒకనొక మంత్రం ఇలా ఉంది "ష్రీమాటజీ ఓడర్ ముట్టర్ కుండలీని, బిట్టె గిబ్ మీర్ ఫ్రైహైట్". స్వాతంత్ర్యం అనేది అడుక్కుతెచ్చుకొనేదని నాకు అప్పుడే అర్ధమయ్యింది. అలా ఈ ప్రహసనం ముగిసాక, గురువులవారు శిష్యులకు (అనగా మాకు) మూలాధార చక్రంనుంచి ఉట్టిపడుతున్నదానినేదో చేత్తే తీసుకొని సహస్రారచక్రంలో (అనగా తలమీద) పోసుకొమ్మని చెప్పారు. కువ్వెన లేని కారణంగా శిష్యులందరూ మూలాధార చాక్రా నుంచి ఊడిపడుతున్నది ఏదైతే ఉందో దాన్ని ఎత్తి పట్టి దీపంబుడ్డీలో కిరసనాయిలు పోసినట్లు పోసుకోవడం మొదలెట్టారు. ఈ తంతు చాలదన్నట్లు, చాక్రాస్‌ను బయటనుంచి తిప్పవచ్చు (నాకెందుకో బస్టాండ్‌లో వెయింగ్ మషీన్‌లో ఉండే రంగురంగు చక్రాలు గుర్తొచ్చాయ్) అని చెప్పాడు గురువగు పీటర్. ఇహ చూడు నాసామిరంగా... రంగుల రాట్నం ఎక్కడానికి పిల్లలు పోటీపడ్డట్టు ఒక్కొక్కడి వెనకా చేరి ఈ చాక్రాస్ ని తెగతిప్పారు (నాకు చిన్నపిల్లలు బొమ్మలకు "కీ" ఇవ్వడమూ, పాత కాలపు కార్లని స్టార్ట్ చెయ్యడానికి చక్రాన్ని తిప్పడమూ గుర్తొచ్చాయ్). నూటెనభై నిముషాలు నాకు బొక్క!! 

ఇక ఎనర్జీ గురించి క్లాసుపీకినప్పుడు మాత్రం నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టాను: హిందూ సాములాళ్ళకి తాము వాగే వాగుళ్ళకి సైన్స్‌ని అద్దాలనిపిస్తే వాడే వదాలు "ఫిజిక్స్", "ఎనర్జీ", "రేడియేషన్", "వేవ్స్/తరంగాలు", "వైబ్రేషన్స్". ఈ గాడిదలకి వాటి గురించి ఏ అవగాహనా ఉండదు. ఈ పడికట్టు పదాలుపయోగించి వీళ్ళు వివరించేదేమీ ఉండదు. జస్ట్ ఆ పదాలు వాడుకుంటారంతే. ఒకానొక తెలుగు హిందూ బ్లాగులో దర్భలు గ్రహణానంతర "రేడియేషన్"ని ఏ విధంగా తొలగిస్తాయో వివరించారు (ఏ తొక్కలో రేడియేషన్ స్వామీ?). ఇంకొక ప్రముఖ హిందూ సైంటిస్టు బ్లాగరు పేర్లలో స్పెల్లింగు మార్చడంవల్ల, ఆపేరుని పిలిచేవారి నోటినుండి వెలువడిన "తరంగాలు" పేరు మార్చుకున్న వ్యక్తి జీవితంపై ప్రభావితం చేస్తాయని కూశాడు. నాకర్ధం కానిదేంటంటే ఇండియలో 90 శాతమ్మంది వెధవాయిలు కాబట్టి, ఇలాంటివన్నీ నమ్ముతుంటారు. జర్మనుల్లో ఒకశాతమైనా ఇలాంటి చెత్త నమ్మరు అనుకున్నాను. అంతలా నమ్మాలనుకుంటే "పవిత్రాత్మ", "ప్రభువు" వగైరాలతో కూడిన చెత్త ఎలాగూ ఉందిగా మళ్ళీ ఇంపోర్టెడ్ చెత్త ఎందుకు?. దురదృష్టవశాత్తూ పరిస్థితి అలా లేదు. ఇండియన్లు తెల్లవాళ్ళు రీసెర్చి చేశారు అనగానే గంగిరెద్దుల్లా తలూపి దాన్ని స్వీకరించినట్లు, తెల్లవాళ్ళుకూడా ఇండియానుంచి ఏదైనా వచ్చిపడిందంటే అది ఖచ్చితంగా పనికొచ్చేదే అని నమ్ముతారన్నమాట.

Friday, June 7, 2019

నారాయణ!! నారాయణ!!


Courtesy : ముచ్చట

విజయం అన్న పదాన్ని డబుతోనూ, డబ్బు సంపాదించడనికి సన్నధ్ధతగానూ నిర్వచించడంతోనే మన పతనం మొదలయ్యింది. అవసరాలకూ... కొండుకచో విలాసాలకూ డబ్బు అవసరమే. కానీ ప్రస్తుతం మనం చేస్తున్నది అదికాదు. అందరికంటే మనకే ఎక్కువ డబ్బుకావాలి. అది. అక్కడే వచ్చింది చిక్కంతా! అందరి కార్లకంటే మనకారు వేగంగా పోవాలి. ఎక్కువ మైలేజీ ఇవ్వాలి. అందరి గేదెలకంటే మన గేదె ఎక్కువ పాలివ్వాలి. అందరి పిల్లకంటే మన పిల్లలు ఎక్కువ డాలర్లివ్వాలి. అలా డాలర్లివ్వాలంటే వాడికి కేవలం ఒక మంచి కాలేజీలో సీటొస్తే చాలదు. మంచి కాలేజీలో, మంచి సీటు (మొదటి వరుసలో మధ్యసీటు లాంటిదేదో) రావాలి. అలా రావాలంటే వాడు చచ్చైనా సరే మంచి ర్యాంకు సాధించాలి. వాడు అలా సాధించాలంటే మనం వాణ్ణి సాధించాలి. అంతలా సాధించబడినా వాడు పెద్దయ్యాక "అమ్మటే మెరిసే మేఘం... నాన్నంటే నీలాకాశం..." అంటూ పాటలు పాడుకుంటూ "చంటి"లో వెంకటేషులాగా తయారవ్వాలి. దానిని అత్యాశ అనరాదు. దానినే దార్శనికతతో కూడిన ప్రేమ అందురు.

ఈ అద్భుతాన్ని మనకు సాధించి పెట్టేవాటినే కోచింగు సెంటర్లు అందురు. ఒకప్పుడు గుంటూరు, నెల్లూరు, ఒంగోలుల్లో తట్టెడుండేవి. ఒకప్పుడు ఇవి కేవలం కోస్తా జిల్లాల్లోనే ఉండడంతో... తెలంగాణనుండి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ఈ కోచింగు సెంటర్లలో కోచబడుతుండేవారు (అప్పట్లో మా కోళ్ళఫారంలో కొన్ని కోళ్ళు నేపాల్నుండొచ్చినవికూడా ఉండేవి). ప్రస్తుతానికి ఒంగోలు పూర్తిగా ఈ విషయంలో వెనుకబడిపోయినందున, గుంటూరు, నెల్లూరు నందు మొదటగా గుర్తించబడిన ఈ విద్యాసంస్థలు ఎబోలా వైరస్‌లా వ్యాపించి ఒక్క ఆంధ్ర విద్యార్ధులనేగాక, ఉత్తరాది విద్యార్ధులనుకూడా భయాందోళనలకు గురిచేస్తున్నాయని ప్రస్తుతం తెలుస్తోంది. వీళ్ల ర్యాంకుల వ్యహారాన్ని ముచ్చట.కాం వారు గట్టిగానే ఎండగట్టారు. అలాంటి వానజల్లులు దున్నపోతుల్లాంటి తెలుగు తల్లిదండ్రులమీద అంతగా పనిచేస్తాయని నేననుకోను. మనదంతా వేలంవెర్రికదా! పైగా ప్రస్తుతం మన వేలంవెర్రి ఎల్కేజీ లెవల్లోనే కనబడుతుంది. "నా కొలీగులందర్లోకీ నా కొడుకే ఎక్కువ ఖరీదైన కిండర్‌గార్టెన్‌లో చదువుతున్నాడు" అన్నది ఈనాటి తల్లిదండ్రులకు ఫ్యాషన్ స్టేట్మెంటు.