ఇరాన్‌లో ఒక ఇరవయ్యేళ్ళ అమ్మాయిని హిజాబు సరిగ్గా వేసుకోలేదని అక్కడి moral police తీసుకెళ్ళి, తీవ్రంగా కొట్టడంతో ఆ అమ్మాయి చనిపోయింది. అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఆడాళ్ళందరూ వీధుల్లోకొచ్చి తమ జుట్టు కత్తిరించుకోవడం ద్వారా నిరసన తెలియజేస్తున్నారు. 'అసలెందుకు హిజాబు వేసుకోవాలి?' అంటే ఆడాళ్ళ జుట్టుచూడగానే మఘాళ్ళు ఎంత పవిత్రులైనా, నిత్యమూ అల్లాని జపించేవారైనా, ఎంతటి ముసలాళ్ళైనా వారిలో కోరికలు పెరుగుతాయట (పురాణాల్లో మునులకు అప్సరసలను చూడగానే వీర్యస్ఖలనమైనట్లు). అయినా అప్పుడు తప్పుపట్టాల్సింది మనసుమీద కంట్రోలు లేని గడ్డాలోళ్ళనేకానీ, ఆడాళ్ళనుకాదే! రేప్పొద్దున ఇదే వాదన ఏ దొంగో చేస్తే ఎంచేస్తారు? 'వాడి జేబులో డబ్బుందని తెలిసాకే నాకు వాడి జేబుకత్తిరించ బుద్ధయ్యిందండీ, వాడిదగ్గర డబ్బుందని నాకు తెలియనివ్వడం వాడి తప్పే' అని వాదిస్తే ఏంచేస్తారుట? మొత్తానికి ఈ moral police ఉన్నదెందుకయ్యా అంటే తప్పొకరిదైతే శిక్ష ఇంకొకరికి విధించడానికన్నమాట. పోలీసుల చేతిలో మూసా అమీనీ హత్యతో మొదలైన నిరసనలు, గొడవలు ఇప్పుడు ఇరానుకు దశాబ్దాలనుండీ పట్టిన దరిద్రాన్ని పారద్రోలేదాకా తగ్గేలా లేవు. శుభం!! ఇరాను మధ్యయుగంలోంచి ఆధునిక యుగంలోకి అడుగిడుగాక. రాక్షస ఇస్లామిక్ పాలన అంతమగుగాక.
ఇటు ఇండియాలోకొస్తే ఆమధ్య హిజాబు వేసుకొని పాఠశాలలకు రావద్దు. అది యూనిఫారంలో భాగంకాదు అని అభ్యంతరపెట్టారు. నాకు తెలీకడుగుతాను మాష్టారూ... పూలు, బొట్టు, రిబ్బన్లూ... ఇవిమాత్రం యూనిఫారంలో భాగమా? అవి పెట్టుకొచ్చే హిందూ అమ్మాయిలపై లేని అభ్యంతరాలు ఒకచిన్న స్కార్ఫ్ విషయంలో ఎందుకొచ్చాయి? మళ్ళీ ఇదే హిందువులు క్రైస్తవ పాఠశాలల్లో అమ్మాయిలని బొట్టుకూడా పెట్టుకోనివ్వరు అని బాధపడిపోతారు. ఏం అప్పుడు ఇదే యూనిఫారం ఎందుకు గుర్తుకు రాదు?
ఇరానులోదీ, ఇండియాలోదీ వేర్వేరు సమస్యలుకావు. సమస్యల్లా ఒకటే ఒకరు ఏం ధరించాలి, ఏం ధరించకూడదు అన్నది ఆయా వ్యక్తులు నిర్ణయించుకోవలసిన విషయం. ఇందులో జోక్యంచేసుకొని, వ్యక్తి హక్కులని హరించజూస్తున్నవే ఈ రెండు సమాజాలూనూ. ఇది కేవలం వస్త్రధారణతో ఆగిపోయేది కూడా కాదు. ఆహారము, ఇతరేతర అలవాట్ల విషయంలో కూడా మనం ఇదే తీరుని గమనించవచ్చు.
అయినా ఈ రోజుల్లో మనుషులకన్నా మతమే ముఖ్యం అనుకొనేవారు, జీవిస్తున్న మనుషులకనా ఎప్పుడో చచ్చినవాడి మనోభావాలే ముఖ్యమనుకొనే మూర్ఖులు అనవసరం మనకిప్పుడు. మన పయనం కాలంతోపాటు ముందుకు సాగాలేతప్ప మహమ్మదుకాలానికో, వేదకాలానికి వేనక్కో కాదు. లేదు మేం అలాగే వెళతాం అనుకొనే వాళ్ళు. వెళ్ళొచ్చు ఎటొచ్చీ మాతోపాటు మిమ్మల్నికూడా తీసుకెళతాం అనేవాళ్ళతోనే సమస్యంతా!