ఎమెర్జెన్సీకి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చూపించిన కారణం "విదేశీ హస్తం". ప్రముఖ కార్టూనిస్టు అప్పటి తన కార్టూన్లలో కొన్నింట్లలో వెనుకభాగాన ఒక హస్తంని వేసేవారట. ఇదేమిటండీ నారాయణ్ గారూ ఆవిడ పార్తీగుర్తా అంటే, అదే విదేశీ హస్తమండీ బాబూ అదెప్పుడూ వెనక నుండే పనులు చక్కబెడుతుంది చాలా పవర్‌ఫుల్లు అంటూ నవ్వేశారట.
అలాంటి విదేశీహస్తాల (ఔను బహువచనమే) గురించి ఈమధ్య తెగబోలెడు వింటున్నాం. డాక్టర్లు ఉద్యమిస్తే పాకిస్తాన్, చైనాల ప్రోద్భలంతోనే వారలా చేశారని ప్రభుత్యం చెప్పింది. మనం నమ్మాం. తరువాత కార్మికులెవరో చేశారు. ప్రభుత్వం మళ్లీ పాకిస్తాన్, చైనాలను స్మరించింది. మళ్లీ మనం నమ్మాం. ఆతరువాత వరుసగా విద్యార్ధులూ, ముస్లిములూ ఇప్పుడేమో కర్షకులూ. ఇంతడేసిమందినీ ఈ దుష్ట పాకిస్తాన్, చైనాలు ఎలా ప్రభావితం చేయగలుగుతున్నాయో నాకు ఏమాత్రం అర్ధం కావట్లేదు. ఎవరైనా చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజు. ఇదేకాక ఈ మధ్య ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రభుత్వం వారు పాకిస్తాన్, చైనా బూచాళ్ళకు చెందిన ఉగ్రవాదులు వచ్చి పాగాలెయ్యకుండా ఉండాలంటే మమ్మల్నే గెలిపించాలి అంటున్నారు. మన ప్రధానిగారి మంచితనాన్ని ఆ బూచాళ్ళు అలుసుగా తీసేసుకుంటున్నారని తెగ బాధ పడిపోయి ఈమధ్య నేను సరిగ్గా అన్నంకూడా తినడమ్మానేసాను (అలా పరగడుపుతో వుండకూడదని డాక్టరంకుల్ పోరడంతో యిస్కీ, సికెనూ కొద్దిగా పుచ్చుకున్నానులెండి).
అందరూ నాలా మంచబ్బాయులుంటారా! ఈ చెడ్డ అంకుల్ని చూడండి "పాకిస్తాన్, చైనాలు ఇలా చేస్తుంటే నువ్వేమైనా పార్లమెంటులో కూర్చొని 'బావలు సయ్యా' పాటకి డాన్సు చేస్తున్నావట్రా యెదవకానా!" అని మన ఆర్ధికమంత్రి అంకుల్ని ఎలా అడుగుతున్నాడో!: https://www.youtube.com/watch?v=L26aVUS63hA
ఏదైన చెడుంటే చెవుల్లో చెప్పుకోవాలిగానీ, ఇలా రోడ్లెక్కి మన ప్రధానిని విదేశాల్లో చులకన చెయ్యొచ్చా? హమ్మా! ఇలాగైతే రేపు పాపం ప్రధానిగారు ఏమొహం పెట్టుకొని విదేశాలకెళతారు, ఐరాసలో ప్రసంగిస్తారు పాపం!! ఇలా రోడ్లెక్కేవాళ్ళందర్నీ కాల్చిపారెయ్యాలి. ఆ కార్మికులనీ, డాక్టర్లనీ, విద్యార్ధులనీ, ముస్లిముల్నీ, రైతుల్నీ, పనిలోపనిగా కమ్యూనిస్టుల్నీ.. అందర్నీ కాల్చిపారెయ్యాలి. చైనాలోనైతే అలాగే చేస్తారు తెలుసా!!