వాడెవడో రాక్షసుడుండే వాడట. వాడు రాక్షసుడిగా పుట్టడంతో పుట్టుకతోనే శాంభరీ మాయలు వస్తాయి. ఆ తరువాత ఈయన మారువేషంతో ఒక ముని దగ్గరకువెళ్ళి అస్త్రశస్త్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడట. ఒకరోజు విద్యార్ధులమధ్య మాటామాట పెరిగితే మనవాడు వాళ్ళందర్నీ వండేస్తాడనుకుంటాను. గురువుగారు దివ్యదృష్టితో ఈ మొత్తం మోసం తెలుసుకుంటారు. తెలుసుకొని "నాయనా శాంభరీ మాయలతోపాటు నీకు అస్త్రప్రయోగంకూడా తెలిస్తే, నిన్ను ఆపడానికి శ్రీమహావిష్ణువు ఇంకో అవతారం ఎత్తలసొస్తుంది. ఆ పాపం నేను మోయలేదిది. అట్టకాదుగానీ నీకేంకావాలో నువ్వేతేల్చుకో. నీకు శాంభరీమాయలో, నేను నేర్పించన విద్యో ఏదో ఒకటిమాత్రమే ఉంటుంది. రెండూమాత్రం అనుగ్రహించలేను" అంటాడు. శిష్యుడు ఆలోచనలో పడతాడు. శాంభరీ మాయలొద్దనుకుంటే వీడసలు రాక్షసుడే కాకుండా పోతాడు. కులభ్రస్టత్వం. పోనీ అస్త్రవిద్య వదులుకుందామా అంటే ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. ఇలా ఆలోచిస్తుండాగానే శిష్యుడు నేలలో కూరుకుపోతున్నాడట. గురువుగారమంటారూ "నువ్వు ఏంతలపెడతావో అని భూమిక్కూడా భయమేనోయ్. అందుకే అది లాగేసుకుంటొంది. ఏం ఫర్లేదు పాతాళానికే ఫో, అక్కడందరూ మీవాళ్ళే! అక్కడున్నంతవరకూ నీకు మాయలూ, అస్త్రవిద్య రెండూ ఉంటాయి. అక్కడనుంచి పైకొస్తేమాత్రం నీకు రెండూ పనిచెయ్యవు".