Friday, September 28, 2018

అక్రమ సంబంధాలు - సుప్రీం కోర్టువారి తీర్పు


ఈ తీర్పును నేను స్వాగతిస్తున్నాను. 

పెళ్ళి అనేది, సంబంధాలు అనేవి, వ్యక్తుల మధ్య వ్యవహారం. అందులోకి కోర్టులూ, ప్రభుత్వాలూ రానేకూడదు (ఇరువురిలో ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తే తప్ప). సంబంధాలు అక్రమమైనా, సక్రమమైనా అది ఆయా వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం. పెండింగ్‌లో ఉన్నకేసులు చాలవన్నట్లు దాని సివిల్ లేదా క్రిమినల్ కేసులాగా మార్చేయడం అనవసరం. అంతగా అవసరమైతే విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అంతేగానీ కేసులేమిటి నాన్సెన్స్!

మరి వివాహ వ్యవస్థో? వివాహ వ్యవస్థ అంటూ ఎమీ లేదు. వ్యవస్థలో వివాహాలున్నాయి. వ్యక్తులమధ్య వివాహాలున్నాయి. వాటిని కాపాడుకోవలసింది ఆయా వ్యక్తులు మాత్రమే! ఒక భార్య అక్రమం సంబంధం పెట్టుకుంటే, ఈ సోకాల్డు "వ్యవస్థ" భర్తతో ఆమెకు విడాకులివ్వమని చెబుతుంది. అదే భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే మాత్రం ఇదే "వ్యవస్థ" ఆమెను సర్దుకుపొమ్మని చెబుతుంది. ఇంత అద్భుతమైన నైతికతను ప్రదర్శించే "వ్యవస్థ"ను మనమేమీ సంరక్షించుకోవలసిన అవసరం లేదు. పెళ్ళి పేరున జీవితాంతం కలిసే ఉండండి అని బలవంతపెట్టే ఈ "వ్యవస్థ" లేని అభివృధ్ధిచెందిన దేశాల వారు సుఖంగానూ, మరింత నిజాయితీతోనూ జీవిస్తున్నారు. 

పనిలో పైగా వ్యభిచారాన్నికూడా చట్టబధ్ధంచేసి దానికూడా ఒక వృత్తిగా పరిగణిస్తే, వాళ్లకి పోలీసుల నుంచీ, బ్రోకరుల చేతిలో పీడల నుంచీ విముక్తి లభిస్తుంది. 

P.S. : ఆ ద్విలింగ సంపర్కాన్ని నేరం కాదని చెప్పిన తీర్పులాగానే, ఈ తీర్పుకూడా ఉపసంహరించుకోబడుతుందని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ మధ్య సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని చాందసవాదానికి గొడ్డలిపెట్టులా మారాయి.

Sunday, September 16, 2018

కౌ-ఇజం



కమ్యూనిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం రెండింటినీ స్వాధీనం చేసేసుకొని, మీక్కొన్ని పాలు దయచేస్తుంది.

ఫాసిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం రెండింటినీ స్వాధీనం చేసేసుకొని, మీకు పాలు అమ్ముతుంది.

సోషలిజం: మీకు రెండావులున్నాయ్. మీరు మీ పొరుగోళ్ళకి ఒకావు దానమిస్తారు.

బ్యూరోక్రాటిజం: మీకు రెండావులున్నాయ్. ప్రభుత్వం ఒకదాన్ని చంపేస్తుంది. రెండోదాన్నుంచి పాలు పితికి, వాటినికాస్తా పారబోస్తుంది.

కాపిటలిజం: మీకు రెండావులున్నాయ్. మీరొకదాన్నమ్మేసి ఒక దున్ననుకొంటారు. మీ మంద పెరిగి, మీ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ ఆవులన్నీ అమ్మేసి, కాలుమీద కాలేసుక్కూర్చుంటారు.

ఫ్రెంచి కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. మీరు సమ్మె ప్రకటించి, జనాన్ని సమీకరించి రోడ్డురోకోలూ, రైల్ రోకోలూ చేస్తారు. ఎందుకంటే మీకు మూడావులు కావాలి.

ఇటాలియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. కానీ అవెక్కడున్నాయో మీకు తెలియదు. మీరుమాత్రం తాపీగా భోజనానికి కూర్చుంటారు.

స్విస్ కార్పొరేషన్: మీకు ఐదువేల ఆవులున్నాయి. కానీ అవేవీ మీవి కావు. వాటిని మీ దగ్గర దాచుకున్నందుగ్గానూ వాటి యజమానులనుంచి మీరు ఛార్జీలు వసూలు చేస్తారు.

అమెరికన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. మీరొకదాన్ని అమ్మేస్తారు. ఆ మిగిలన ఒక్కావునూ నాలుగావుల పాలిమ్మని బలవంతపెడతారు. చివరకు అ ఆవు ఎందుకు చనిపోయిందో ఒక కన్సల్టెంటుద్వారా పరిశోధిస్తారు.

ఇండియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. వాటిని మీరు పూజిస్తారు.

ఐరిష్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. అందులో ఒకటి గుర్రం.

ఆస్త్రేలియన్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. అంతా బాగానే ఉంది గనుక మీరు అదంతా మానేసి, హాయిగా బీరు తాగుతూ ఏంజాయ్ చేస్తారు.

ఇరాకీ కార్పొరేషన్: అందరూ మీకు ఎన్నో ఆవులున్నాయనుకుంటారు. మీరుమాత్రం మీకు ఒక్కావుకూడా లేదని మొత్తుకుంటారు. మిమ్మల్నెవ్వరూ నమ్మరు. అంతాకలిసి మీదేశమ్మీద బాంబులేసి నాశనం చేస్తారు. మీకు ఇప్పటికీ ఒక్కావుకూడా లేదు. అయితేనేం? మీకు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది! 

బ్రిటీష్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. రెండూ పిచ్చివి.

గ్రీక్ కార్పొరేషన్: ఫ్రెంచివాళ్ళూ, జర్మన్ వాళ్ళూ ఇచ్చిన రెండావులు మీకు ఉన్నాయి. మీరు రెంటినీ కోసుకు తినేస్తారు. వాళ్ళు మిమ్మల్ని వాటిల్ని తిరిగిమ్మన్నప్పుడు, ప్రపంచ బ్యాంకును సాయమడుగుతారు. ప్రపంచ బ్యాంకు రెండావుల్ని మీకిస్తుంది. మీరు ఆరెంటినీ కూడా కోసుకు తినేస్తారు. ప్రపంచ బ్యాంకు మిమ్మల్ని తనిచ్చిన రెండావుల్నీ తిరిగిమ్మంటుంది. అదేం పట్టించుకోకుండా మీరు క్రాఫు చేయించుకోవడానికి సెలూనుకు వెళతారు.

చైనీస్ కార్పొరేషన్: మీకు రెండావులున్నాయ్. వాటినుండీ పాలు పిండడానికి మీరు 300 మందిని నియమిస్తారు. మీరు క్షీరోత్పత్తిలో, ఉపాధి కల్పనలో ప్రపంచంలోనే ముందున్నామని ప్రకటించుకుంటారు. "నిజం ఇది" అని చెప్పిన జర్నలిస్టును అరెస్టుచేసి, జైల్లో పెడతారు.

Courtesy Instagram.

Thursday, September 13, 2018

ఈ మధ్య విన్న కొన్ని విషయాలు

ఒకానొక ఒక ట్రైనులో ఒకతను హఠాత్తుగా నాతో... "దేవుడున్నాడంటారా?" అనడిగాడు.

I was like... really? That's why you are taking the train journey? To figure out the answer to your question?


ఇలాంటిదే ప్రశ్న నాకు ఒక టాక్సీ డ్రైవర్ నుంచి ఎదురైంది.  Why don't you believe in God? (ఇందులో మాత్రం తప్పు నాదికూడా ఉంది)
నేపధ్యం:  కారు ఒకానొక హైవేమీద 230KMPH లో వెళుతోంది. కుర్రాడు మొరొక్కో నుంచి.  

నేనేమో.... కారు 230 కొడుతున్నప్పుడు మీతో అది నేను డిస్కస్ చెయ్యను మాస్టారు...  కారు ఆగాక కావాలంటే నా రూం కొచ్చెయ్యండి. అక్కడ కుర్చీ.. తాడు... అన్నీ ఉన్నయ్. మీసైజుకు సరిపోతాయ్ కూడా! కూర్చొని ఖుల్లంఖుల్ల బాతే కరేంగె.

ఒంకొకాయన... స్టేషను సమీపిస్తుండగా.... ఇప్పుడు మన ష్టేషనుకు రెండిస్తారా, లేక నాలుగా? (రెండో ప్లాట్ఫారమా లేక నాలుగా?)

నేనేమో.. ఇలాంటి సృష్టిరహస్యాల గురించి తాత్వికచర్చలకు దిగి మనమెందుకండీ బుర్రపాడుచేసుకోవడం? సూపర్ కంప్యూటర్లుండగా? I mean common... why does it even matter? That guy was not even getting down at that station!

ఇంకొకాయన... "ఆ... శ్రీ... ఇక్కడ గొడావరి క్రాసింగుంది... కుంచెం లేటవుతుంది.  ఒక ఇరవై నిమిషాలు లేటవుతుంది. వచ్చేస్తా."

ఈయన మాత్రం నాకు పిచ్చపిచ్చగా నచ్చాడు. భార్య "శ్రీ"గారు ఈయన రాకకోసం ఇంటివద్ద విరహతాపంతో రగిలిపోతూఉండగా, మధ్యలో ఏ దిక్కుమాలిన దేవుడో ఓర్చుకోలేక కలిగించిన అడ్డంకికి, softcore-క్షమాపణలర్పించుకోవడమే కాకుండా, వచ్చేస్తానని confirmationకూడా ఇచ్చేసిన ఇలాంటివాళ్ళు నేడుగానీ రాజకీయాల్లో ఉంటేనా నాసామిరంగా!