విచారణలేకుండా శిక్షనమలు చెయ్యడం ఒక అసమర్ధ లేదా దుర్మార్గపు వ్యవస్థ చేసింది. అనాడు ఇదే పని ఆనాడు బ్రిటీషు ప్రభుత్వం చేసింది. ముగ్గురుని చంపేసింది. అది దుర్మార్గ వ్యవస్థ.
ఈనాడు భారతవ్యవస్థ పరిధిలో న్యాయం జరగదని ప్రజలు అనుకున్నారు. ప్రభుత్వం ఒప్పేసుకొని. వెంటనే వాళ్లను వ్యవస్థకవతల చంపేసింది. ఇది తన అసమర్ధతను తాను ఒప్పేసుకోవడమే! విచారణ త్వరితగతిన జరిపి, ఇదే శిక్షలు అప్పుడే విధించవచ్చునే! అలా ఎందుకు చెయ్యకూడదు. రేప్పొద్దునెక్కడో దొంగతనం జరిగితే ఎవర్నో ఒకర్ని పట్టుకొని జైలుకి పంపిస్తే అది సరైనదేనా? అలా భారత్‌లో జరగదా? జరగలేదా? జరగలేదనుకొనేవాళ్లందరూ "హజారీభాగ్ కధలు" అనే పుస్తకాన్ని చదవలి. లేదా కాశ్మీర్‌లో ఏంజరుగుతోందని నిష్పక్షపాతంగా తెలుసుకొనే ప్రయత్నమైనా చెయ్యలి. టాడా లాంటి చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని మనం వాటిని రద్దుచేసేశాం. మరి ఈ దరిద్రాన్ని ఎప్పుడు రద్దుచేసుకుంటాం? మృగాల్లా వ్యవరించినవాళ్ళకి మానవహక్కులుండకూడదు ఒప్పుకుంటాను. మరి వాళ్ళేచేశారని పోలీసులు చెబ్తే మనం నమ్మెయ్యాల్సిందేనా? విచారణ చెయ్యఖ్ఖరేదా? పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చెయ్యడాన్ని మనమెన్నడూ మన దైనందిన జీవితాల్లో చూడలేదా? మన చేపలుపట్టే వాళ్ళు ఒక్కోసారి పొరపాటున వేరే దేశాల్లోకి వెళుతుంటారు. ఆయా దేశాలు వాళ్ళను విచారణకూడా లేకుండా వాళ్ళను గూఢచారులని ముద్రవేసి చంపేస్తుంటారు. అదంతా కూడా సరైనపనేనా?
సమస్యలెప్పుడూ బాహ్యంగానే కనిపిస్తాయి. నాకో అతను తెలుసు కనబడ్డ ప్రతి ఆడపిల్లమీదా అతి ఛండాలంగా కామెంట్ చేసేవాడు. అఫీసులో, రోడ్డుమీద ఏఆడపిల్లైనా మనవాడి దరిద్రపు కామెంట్లను గురవ్వాల్సిందే! ఒకరోజుండబట్టలేక అడిగేసాను "నేనూ అలా మీఇంటోవాళ్లను గూర్చి వాగొచ్చా? అలా వాగితే ఎలా వుంటుంది?" అని. అప్పటికీ అతనికి బుధ్దిరాలా. అలాంటివాళ్ళు మనలో ఎంతమంది లేరు? ఇంతటి గొప్ప సంస్కారవంతులైన వీళ్ళిళ్ళలో రేపిస్టులు కాక సంస్కారులు పుడతారా? వాళ్ళేదో దరిద్రప్పని చేశారని ఇప్పుడు చంపెయ్యమని రోడ్డుకెక్కిన జనాలునిద్రలేస్తే చూసేది జబర్దస్తులూ, సంస్కారవంతమైన మన సినిమాలూనూ. అంటే ఎవరో ఒకరు ఎవరో ఒకరి perversionకి బలైతే మనం కొన్నాళ్ళు రోడ్డెక్కి గోలెడతాం. ఆవేశం చల్లబడగానే మళ్ళీ మన perverted జీవితాలతో busyగా ఉంటాం. అంతేగా? ఏదైనా జరిగాక, "చంపెయ్యి"మని గోలచెయ్యడం? ఈ మాత్రం దానికేనా భారతీయులు తామేదో మిగిలినవారికనా గొప్పగా భావించి విర్రవీగుతుంటారు? ఈమాత్రానికేనా India is the best అంటూ చొక్కాలు చించుకొనేది?
నిర్భయ హంతకులకు విధించిన శిక్ష విధించడానికే మనకెంత సమయం పట్టిందో తెలుసుకుంటే, ఈ దిక్కుమాలిన వ్యవస్థ ఎంత కుళ్ళిపోయిందో మనకర్ధమవుతుంది. ఇక్కడ కేసులు దశాబ్దాలపాటు సాగుతాయి. కానీ విషయం అదికాదు. మిగతా దేశాల్లోకూడా కేసులు అలాగే సాగుతాయి (Paul Bernardo కేసులో విచారణ ఐదేళ్ళపాటు సాగింది. జనాల మూడ్ వాడికి వ్యతిరేకంగా ఉందని, విచారణ నిష్పక్షపతంగా జరగాలని మూడేళ్ళు cool-off సమయంకూడా ఇచ్చారట). కానీ ఆదేశాల్లో దోషికి శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజలకుంటుంది. ఇక్కడ అది అసాధ్యం. ఉదాహరణలు కోకొల్లలు. సాక్షులు చంపెయ్యబడుతారు. సాక్ష్యాలు మారిపోతాయి. ఆధారాలు తారుమారౌతాయి. అంతా అయ్యాక క్షమాభిక్షలూ ఉంటాయి. నిష్పక్షపాతంగా ఎవరైనా విచారణ చెయ్యాలనుకున్నా, తీర్పు నివ్వాలనుకున్నా వారు బదిలీ అవ్వడమో, చనిపోవడమో జరుగుతుంది.మనోళ్ళు పోర్న్ నిషేధించండి, సారా నిషేధించండి అంటారు కానీ. లోపం సంస్కృతిలోనే ఉందని మాత్రం గుర్తించరు. పెంపకాలు అలా ఛస్తాయ్. జర్మనీలో ఒక ఆడపిల్ల ఎలాంటిబట్టలు వేసుకున్నా, ఏటైములో బయటతిరిగినా, తాగున్నా, అబ్బాయిలూ తాగున్నా, ముట్టుకోడానికి పోలీసులకూ, కోర్టులకూ, సమాజానికీ, భయపడతారు. దానికి మించి, అలా ముట్టుకోవడం తప్పు అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కొందరు వెకిలి జనాలు ఇండియా, మరియు కొన్ని కల్లోలిత ప్రాంతాల నుంచి వలసలు పెరిగాక పరిస్థితి కొంచెం మారింది గానీ. Vulgarగా ప్రవర్తించిన జర్మన్‌గురించి నేను చదవలేదింకా. మరిక్కడ సూఫర్ మార్కెట్లో సారా కొనుక్కోవచ్చు (బారు అన్న కాన్సెప్టే లేదు పబ్బులుతప్ప), పోర్నుంది, ప్రాస్టిట్యూషనూ లీగలే! అయినా ఇక్కడ రోజుకు తొంభైరెండు రేపులు జరగట్లేదు మరి! సమస్య మనం పిల్లల మెదళ్ళలోకి ఎక్కిస్తున్న సాంప్రదాయక భావజాలంలో ఉంది. చిన్నవయసులోనే మగపిల్లాడికి వాడే పులనీ, మిగతా ఆడవారందరూ లేడిపిల్లలనీ బుర్రలోకి ఎక్కించేస్తారు. వాడు అందరాడపిల్లకన్న ఎక్కువనీ, ఒక ఆడపిల్ల మగపిల్లాడికన్నా తక్కువనీ నేర్పించేస్తారు. మరప్పుడు ఇక్కడి మగపిల్లలూ, ఆడపిల్లలూ అలా తయారయితే అది వాళ్ల తప్పెలా అవుతుంది? దానికి మన మత సాహిత్యమూ, మతగురువులూ, ప్రవచనకారులూ, పాస్టర్లూ, ముల్లాలు చెప్పేదాన్ని కలిపితే విస్ఫోటనమే కదా! అందుక్కాదూ రేపులు జరగ్గానే రాజకీయనాయకులు సమర్ధించేసేదీ, బాబాలు తింగరి వాగుళ్ళు వాగేదీ, FBలో జుగుప్సాకరమైన పోస్టులతో శునకానందం పొందేదీ? ఇంత పావనమైన ప్రజలున్న దేశంలో 545 మంది MPల్లో కేవలం 75 మంది మీద ఎలాంటి కేసులూ లేవు. ఒక డెభ్బై మందికిపైగా MPల మీద అత్యాచార కేసులున్నాయి. వీళ్ళు కులమో, మతమో ప్రధానంగా ఓట్లేసి ఈ పుణ్యపురుషుల్ను ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తూ ఉంటారు. వీళ్ళు రేపుకు వ్యతిరేకమా? హ..హ..హ..
మరణ దండనల గురించి ఇంకోటి. మనుషుల్ని చంపేయడం ఆటవికమని చాలా దేశాలిప్పుడు నమ్ముతున్నాయి. అదంతా హిందూ, ముస్లిము రాజ్యాలింకా తమ అనాగరికపు గతాన్ని నెత్తినపెట్టుకు ఊరేగడంగా నాకనిపిస్తుంది. నేనైతే ఘోరశిక్షలు చేసినవారిని మరోసారి సమాజంలోకి వదలొద్దంటాను. కొన్ని దేశాలు దాన్ని చేసిచూపిస్తుంటాయికూడా! Anders Behring Breivik అనే తీవ్రవాది ఒకడు. 2011లో తన దేశంలో ఏదో సమావేశానికొచ్చిన 77 మంది పిల్లలను కాల్చిచంపాడు. వాడికి పడిన శిక్ష 21 ఏళ్ళట (అంటే వాడు కాల్చిన ప్రతి పిల్లవాడికీగాను, కేవలం 4 నెలల శిక్ష!). అయినా దాన్ని వాళ్ళు దాన్ని సమ వ్యవస్థ ఔదార్యంగా చెప్పుకు గర్విస్తారే తప్ప, రోడ్లెక్కి రక్తంకోసం గెంతరు. ప్రస్తుతానికి భారత్‌లో తీవ్రనేరాలు చేసినవాళ్ళకి అమెరికాలోలాగా ఒక రెండొందలేళ్ళు కఠిన జైలుశిక్ష విధిస్తే సరిపోతుందేమో ఆలోచించాలి.