Saturday, February 20, 2021

మన నాశనం మనమే కొనితెచ్చుకుందాం!

 మడ అడవులు నరకడం వల్ల కలుగుతున్న దుష్పరిణమాలు మనం చూస్తున్నాం. హైదరాబాదులో మనం చేసిన అభివృధ్ధి ఫలితం మొన్న చూశాం. ప్రతి వర్షాకాలంలోనూ ముంబై మునుగుతుంది. చెన్నై safe కాదు. బెంగళూరు safe కాదు. కేరళకూడా కాదు.

అదలా ఉండగానే మొన్నటికిమొన్న యురేనియం కోసం నల్లమల అడవులు నాశనం చెయ్యాలనుకున్నాం. ఛత్తీస్ఘడ్, గోవాల్లో మనం అక్కడి ఆడవుల మధ్య పరిశ్రమలు నిర్మించబోతున్నాం. వాటికోసం రైల్వేలైన్లు నిర్మించబోతున్నాం. ఆరావళీ దున్నేయబోతున్నాం. అస్సాంలోకూడా కూడా నిర్మించనున్నామండోయ్! ఉన్నకొద్దిపాటి చెట్లుకూడా నరికేసుకొని, ఈసారొచ్చే ప్రతి వరదనూ మనవాళ్ళు ఎలా తట్టుకోబోతున్నారో పరీక్షించబోతున్నాం.

ఏవడికోసం? అభివృధ్ధికోసం. కదా? మన కంపెనీలు ఇనుప ముడిఖనిజాన్ని ఎగుమతి చేసినప్పుడు (ప్రధానంగా చైనాకు) వారు భారత ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ కేవలం 0.7 శాతం అట. అంటే మన కంపెనీలు 1000 రూపాయల విలువగల ఇనుప ముడిసరుకును ఎగుమతి చేసినప్పుడు భారత ప్రభుత్వానికి అనగా భారత ప్రజలకు చెల్లింగేది 7 రూపాయలు. అంటే ఇంకొకడి economy కోసం మనం మన ecology నాశనం చేసుకుంటున్నాం. ఉద్యోగాలు కల్పించబడుతున్నాయిగా? ఖచ్చితంగా! తక్కువ ఖర్చుల్లో మన గొయ్యి మనమే తవ్వుకొనే ఉద్యోగాలు. మరి మనకి లాభమే కలగట్లేదా? ఎందుకులేదు ఇవన్నీ మనలో ఒకణ్ణి అత్యంత ధనికుణ్ణి చేస్తాయి. దానికోసం మనం నాశనమైపోదాం. రేప్పొద్దున వరదలూ, భూకంపాలూ, గుర్తు తెలియని రోగాలూ వస్తే. చచ్చూరుకుందాం.

మన వినాశనం కొనితెచ్చుకొనే హక్కు మనకు బ్రహ్మాండంగా ఉంది. మనలను రక్షించే బాధ్యత ఈ పర్యావరణవాదులకు లేదు, ఈ Greta కూ లేదు. స్వధర్మే నిధనం శ్రేయహ. మన చావు ఖచ్చితంగా మనం చద్దాం. అతి దుర్మార్గమైన చావే చద్దాం. ఆ ఒక్కడూ ధనికుడైనప్పుడు మనం పండగ చేద్దాం!

ఇది ఖర్మభూమి (కర్మభూమి కాదు). చంపేదెవడూ? చచ్చేదెవడు? అంతా లలాటలిఖితం. మనం మెదళ్ళూ, చేతులూ వాడొద్దు. జై భారత్మాతాకీ!