Sunday, July 28, 2019

తెగులు!!

అప్పుడెప్పుడో ఈనాడు చదువుతుంటే వింత పదాలు తగిలేవి. గుత్తేదారు అన్నపదం తొలిసారి విన్నప్పుడు అదేదో బూతుపదం అనుకున్నాను. ఇప్పటికీ నాకు కాంట్రాక్టరు అన్నపదానికి సమానార్ధకం "గుత్తేదారు" ఎలా అయ్యిందో తెలీదు. అప్పట్లోనే "విభాగిని"ని ఢీ కొని కారులో వాళ్ళు మరణించారు అని చదవగానే నా కోడి బుర్రలో బోల్డు డౌటనుమానాలు "జ్యామెట్రీ బాక్సును రోడ్డుమీద వదిలెయ్యడమేమిటి? దాన్ని ఢీకొని కారులోవాళ్ళు చచ్చిపోవడమేమిటీ" అని. కాసేపటికి తట్టింది విభాగిని అంటే డివైడర్ అని. గగనసఖి అనేది ఇంకో తెగులు పదం. కొన్నాళ్ళు వాయు సేవకి అని ప్రయత్నించారనుకుంటాను. ఇదిలా పోతే ముందుముందు కలెక్టరును "మహామండల కరగ్రాహిని" అని, Executive officeerను "కరగ్రాహక అభియంత" అనీ అనువదించే రోజులుకూడా దగ్గర్లోనే ఉన్నాయ్. ప్రస్తుతానికైతే "బాహ్యవలయ రహదారి", "అంతర్వలయ రహదారి" చూడలేక ఛస్తున్నాం. ఇక కంప్యూటర్ వార్తలు చదివితే జుట్టుపీక్కుంటాం. "అనువర్తనము" అనేది appకి వచ్చిన ఖర్మ. Big Dataను "భారీదత్తం" అని అనువదించాడో ప్రబుధ్ధుడు.

మరి అంత ప్రమాణాలు పాటించే పత్రికలోనే "పాలాభిషేకం" అని రాస్తారు. పాలాభిషేకం ఏమిటి? ఈలెక్కన మిల్కాభిషేకం అనికూడా రాసుకోవచ్చా? రెండు వేర్వేరు భాషా పదాలను ఎవడైనా ఒకపదంలా సంధిస్తాడా?

ఇదంతా చదివాక రావికొండలరావుగారు పంచుకున్న ఒక ముచ్చట గుర్తుకొస్తుంది. ఒకాయనకి ఇంగ్లూషు అంతగా రాదుకాబట్టి సాధ్యమైనంత తెలుగులో రేపు ఆయన తిరుపతిలో షూటింగ్ కి హాజరవ్వాలి అన్న విషయం చెప్పమంటే తెలుగు ఎక్కువ తెలిసిన ఒకాయ ఇలా రాసాడంట : "రేపు మనకు తిరుపతిలో కాల్పులు. కాల్పుల్లో మొదటి దెబ్బ మీమీదనే!" అని రాసి పంపించాడట.

Saturday, July 27, 2019

నటుడు శివాజీ యవారం మరియు భారత వ్యవస్థ చాతాళం.

ఈ దరిద్రుడివ్వాళ దుబాయ్లో దొరికాడట. వీణ్ణి హైదరాబాదులో ఎందుకు పట్టుకోలేదు. అసలు వీడిమీద look out notice ఉన్నప్పుడు వీడు దేశమెలా దాటాడు? ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక పదివేలు SBIకి బాకీ పడ్డాను, యెస్బైవాడు చావగొడతాడు నన్ను అది చెల్లించిందాకా. అదే పదికోట్లనుకోండి, ఏ నాకొడుక్కీ నన్ను ముట్టుకొనే దమ్ముండదు.ఒక వెయ్యికోట్లనుకోండి, అప్పుడు దేశపు విదేశంగామంత్రే జాగ్రత్తగా సరిహద్దులు దాటిస్తారు.



1700 కట్టలేక మూడేళ్ళు జైల్లో ఉన్నారని తెలిసినప్పుడు ఒకరోజంతా బాధపడ్డాను. మరి ఈ గాడిదలు లక్షలూ, కోట్లూ దోచుకొని ఏలాగున దర్జాగా తిరుగుతున్నారు? ఇలాంటొ గొప్ప వ్యవస్థని మనం ఎందుకు గౌరవించాలి?

Friday, July 12, 2019

బ్రీచెడువారు - బ్రోచెడువారు - ఇరాను సంక్షోభం

Image result for hormuz

ఆమధ్య ట్రంపుడు ఇరానుతో ఒబామా హయంలో చేసుకొన్న ఒకానొక ఒప్పందాన్ని "చెత్త"గా అభివర్ణిస్తూ, దాన్ని ఏకపక్షంగా బుట్టదాఖలుచేశారు (అనగా బ్రీచారు -breach). ఆ సందర్భాన్ని ఇరానియన్లు అమెరికా జెండాను అదేదో  బీడి ముక్కన్నట్లు కాల్చిపారనూకడం ద్వారా సెలబ్రేటు చేసుకున్నారు). అది చాలదన్నట్లు ఈమధ్య ఇరానియను ప్రెసిడెంటుగారు "మా యురేనియం ఉత్పత్తి వేగం చూస్తుంటే మేము ఫలానా అంతర్జాతీయ ఒప్పందాన్ని ఫలానా రోజున బ్రీచగలమనిపిస్తోంది" అని వాకృచ్చారు. వెంటనే ట్రంపుడు గారు ఆయొక్క అంతర్జాతీయ ఒప్పందాన్ని బ్రోచవలసిన అవసరం యావత్ప్రపంచదేశాలకూ ఉన్నదని గుర్తుచేస్తూ ఱంకెలువేశారు. అది చాలక పుండు మీద ఆసిడ్ రాసినట్లు ఇరానులవారు ఈమధ్య ఇంకోసారి ఆ యురేనియంతో తాము ఏం చేయదలచుకుంటున్నదీ వివరించారు(నాకు తెలిసినంతవరకూ యురేనియంతో గొడుగులూ, సైకిళ్ళూ, వంటపాత్రలూ చెయ్యరు). అప్పటికే యుధ్ధమేఘాలు అలుముకొనుండగా, ఒకానొక శుభదినాన ఇరానులవారు అమెరికన్ నౌకలకు కన్నం వేయడమూ, ఏకంగా వారి డ్రోనులను కూల్చివేయడమూ చేశారు(ఇది బొత్తిగా మర్యాదలేని వ్యవహారమని నా అభిప్రాయం. ఇండియా వారుకూడా పాకిస్తాను విమానాలను కూల్చుతారేగానీ, అమెరికా విమానాల విషయంలో ఒళ్ళుదగ్గరుంచుకొని ఆగ్రహాన్ని మాత్రమే వ్యక్తం చేస్తారు).  ఇరానుకు ప్రస్తుతం బ్రిటీషువారితో చేతలయుధ్ధం కొనసాగుతున్నది. మొన్నొకసారి చేసిన ప్రయత్నంలో వెనుదిరిగినా, అదే ప్రయత్నం మరొకసారి జరగదన్న గ్యారంటీ ఏమీలేదు.

అసలు ఏం జరుగుతోంది? ఉదిక్కుమంటే యుధ్ధానికెళ్ళే అమెరికా ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది? చిత్తమొచ్చినట్లు మాట్లాడే ట్రంపుడు కూడా, ఆ విమానాన్ని కూల్చాక,  "ముందు ఇరానుపైకి దాడినాదేశించినా, కలలో కనిపించిన దివ్య పురుషుడు 150 ప్రాంతాల ప్రజలు నష్టపోతారని చెప్పడంవల్లే చివరిక్షణంలో నేను దాడిని ఆపు చేయించాను" అని చెప్పుకొచ్చాడు (కెమిస్త్రీలో అవగాడ్రో నంబరులాగా... ఈ 150ని ట్రంపు నంబరుగా వ్యవహరించాలనేది నా అబిప్రాయం). ఆఖరుకి బ్రిటనుకూడా దాడిచెయ్యబోయేవాళ్లను బెదిరించిందేగానీ, అంతకుమించి ఇంకేం చెయ్యడానికీ సాహసించలేదు. ఏమా మర్మము? దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవలసింది జూనియర్ బుష్‌గారికి. ఆయనగనుక ఇరాకుమీద యుధ్ధం చేసి అమెరికాకు తగిన పాఠాలు నేర్పకుంటే, ట్రంపుడు ఈపాటికి ఇరానుమీద దాడి చేసితీరుండేవాడు. ఇరాకు యుధ్ధం నెలల్లో ముగుస్తుంది, మరియు దానికి మహావుంటే 5 బిలియన్లు ఖర్చౌతాయి అని చెప్పింది బుష్ప్రభుత్వం. తీరా అది దాదాపు పదేళ్ళపాటు సా.....గింది. ఐన ఖర్చు రమారమి 1 ట్రిలియనట (1.1 trillions is the official figure) అనగా రెండొందలరెట్లు ఎక్కువ ఖర్చయ్యిందన్నమాట. ఇలాంటి విజయాన్నే Pyrrhic Victory అంటారు. అది ఇరాకు గొడవ. మరి ఇరానో? ఇరాను ఇరాకు కంటే పెద్ద దేశము, బలమైన దేశము. మంచి వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. యుధ్ధమంటూ మొదలైతే హార్మూజ్ జలసంధి మూసుకుపోతుంది. హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచమ్మొత్తానికి అవసరమైన దానిలో ఐదవవంతు చమురు రవాణా అవుతుంది (రోజుకు 19 మిలియన్ బ్యారళ్ళు. హార్ముజ్ తరువాత స్థానం మలక్కా జలసంధిది - రోజుకు 16 మిలియన్ బ్యారళ్ళు). హార్ముజ్ మూసుకుపోతే దాని ప్రభావం ప్రతిదేశంపైనా పడుతుంది (పెట్రోలు ధరలు పెరుగుతాయ్. దానివల్ల బాగుపడేది పెట్రోలియం ఉత్పత్తిచేసే కంపెనీలు మాత్రమే. అమెరికాలోని ఈ కంపెనీలే ప్రస్తుతం యుధ్ధం జరగాల్సిందేనని లాబీయింగ్ చేస్తున్నాయ్). దానివల్ల తీరా యుధ్ధం మొదలయ్యాక, ఈ పెట్రోలు ధరల సెగ తగిలాక, ఇప్పుడు అమెరికాకు వత్తాసు పలికినదేశాలే బాహాటంగా అమెరికాను విమర్శించి, ఇరానును సమర్ధించే అవకాశాలున్నాయనేది అమెరికాకు బాగా తెలుసు (పోయిన ఇరాకు యుధ్ధంలోనే జర్మనీ, ఫ్రాన్సులు అమెరికాను "దొబ్బెయ్!' అన్నాయి).

అమెరికా యుధ్ధం చేసేనాటికి సద్దాముడు ఐరాస ప్రాపుకోసమని తన ఆయుధాలు తానే నాశనం చేవ్సుకొని జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే స్కూలుపిల్లాడిలా చేతులుచాచి నుంచున్నాడు. ఇరానెప్పుడూ "ఢీ" అంటే "ఢీ" అన్నదేగానీ, ఏనాడూ అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకున్నది లేదు. ఇరాను నిర్మించిన అణుకర్మాగారాలు "కుటీర పరిశ్రమ"ల బాపతట -పరిమాణంలో చిన్నవి, దాచడం సులువు. ఒకమోస్తరు దాడిచేసి వెనక్కెళ్ళిపోదామా అంటే ఇరాను అణుపాటవం సంపాదించడానికి కావలసింది కేవలం మరో నాలుగేళ్ళట. అలా కాకుండా నివారించాలంటే అమెరికా ఇరాన్ను కొన్నేళ్ళపాటు సైనికంగా తన అదుపులో ఉంచుకోవాలట. ఇరాకు యుధ్ధానుభవాల నేపధ్యంలో అమెరికా అంతటి సాహసానికి పూనుకొంటుందనుకోను. అసలు విషయం ఇవేవీకూడా కాదు.  సైనిక సంపత్తి విషయంలో ఇరాను అమెరికా అంతటి పుడింగి కాకపోయినా ఇరానుకు ఇప్పటికే వివిధ దేశాల్లో గూడచారివ్యవస్థలూ, తీవ్రవాదుల స్లీపింగ్ సెల్సూ, ఇరాను చెప్పినట్లు తలాడించే కొన్ని సంస్థలూ ఉన్నాయట-ఆఖరుకు ఇరాను సాంప్రదాయక శత్రువు సౌదీలోకూడా! (ఈ విషయంలో సద్దాముడు బొత్తిగా అమాయకుడు. ఆయనకూడా ఇలాంటి వాటిని  ఏర్పరచుకొనుంటే ఇరాకుయుధ్ధం మరోలా ఉండుండేది). ఇప్పుడు యుధ్ధమే మొదలైతే సాక్షాత్తూ అమెరికన్ సైన్యమే హిజ్బొల్లా తీవ్రవాదులతోనూ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్‌తోనూ పోరాడాల్సొస్తుంది. అమెరికాకు సహాయంగా యుధ్ధంలోకి దిగిన దేశాల్లో తీవ్రవాద దాడులూ పెరగొచ్చు. సౌదీ ఎన్నటినుంచో భయపడుతున్నట్లు ఇరాన్ సౌదీలోకి బాహాటంగా తన ఇస్లామిక్ విప్లవాన్ని ఎగుమతి చెయ్యొచ్చు. అప్పుడు ఈ రెండు దేశాలుకూడా ఇప్పటిదాకా అనుసరిస్తున్న ప్రఛ్ఛన్న యుధ్ధవిధానాన్ని వీడి ప్రత్యక్షయుధ్ధానికి దిగాల్సిన పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ఇప్పటికే వీరివురూ ప్రఛ్ఛన్న యుధ్ధాలు చేస్తున్న సిరియా, ఇరాక్, యెమెన్,  లిబియా దేశాల్లోని పోరాటాలు మరింత ఉధృతమౌతాయి. అప్పుడు ఏకంగా సౌదిలో ఈజిప్టు తరహా విప్లవం వచ్చినా, బహ్రెయిన్లో గతంలో అణగదొక్కబడిన ప్రజాస్వామ్య పోరాటం మళ్ళీ తలెత్తినా ఆశ్చర్య పోనఖ్ఖర్లేదు. అటుపక్క ఇజ్రాయెల్‌పైనా దాడులు పెరుగుతాయి. ఈ గొడవ నేపధ్యంలో ISIS భూతం మళ్ళీ జీవం పుంజుకొంటే అదింకో తద్దినం. ఇలాంటి బహుముఖ యుధ్ధాలు(war on multiple fronts) చేసిన మూర్ఖుడు ఒక్క హిట్లర్ మాత్రమే! అయన అడుగుజాడల్లో నడవడానికి అమెరికా ఇష్టపడకపోవచ్చు. ట్రంపుడుడి పాపులారిటీ అసలే స్వదేశంలోకూడా లేదు.


నాకు తెలిసినంతవరకే ఇన్నున్నాయ్ ఈ యవారంలో. అందుకే అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. అయినా యుధ్ధం ఎప్పుడూ మంచిదికాదు. మూర్ఖులే యుధ్ధాలు చేస్తారు. తెలివైనవాళ్ళు మార్కెట్లు పంచుకుంటారు.

Saturday, July 6, 2019

పోలీసు చర్య ఖర్చులెవరు భరించారు?

Courtesy: చిలుకల పందిరి (అంధ్రజ్యొతి). రచన: ముళ్ళపూడివారు. 

నిజాము నవాబుగారు ఏకంగా దేశం మధ్యలో ఉన్న హైదరాబాదును పాకిస్తాన్‌లో కల్పాలనుకున్నప్పుడు, అప్పటి రక్షణమంత్రి పటేల్‌గారికి మండుకొచ్చి, ఒక "పోలీసుచర్య" జరిపించారు. తత్ఫలితంగా నిజాముగారు "నన్నొగ్గెయ్ పటేలా" అంటూ దేశంవిడిచి పారిపోయారు. ఇది ఆ తరువాతి సంగతి. అంతా అయ్యాక ఈ "పోలీసుచర్య"కి ఐన ఖర్చులు ఎవరు భరించాలి అనే ప్రశ్న ఉత్పన్నమయ్యిందట. పోలీసు వాళ్లని భరించమంటే, వాళ్ళేమో జరిగింది "పోలీసు"చర్యైనా అందులో పాలొన్నది సైన్యంకాబట్టి, వాళ్లనే అడగండి అని సలహా ఇచ్చారట. తీరా సైన్యాన్ని అడిగితే, "పేరు వాళ్ళకీ, చమురొదిలేదిమాకా?" అని నిష్టూరమాడుతూ, జరిగింది "క్రమశిక్షణచర్య"  కాబట్టి విద్యాశాఖవాళ్ళని అడిగిచూడండి అని ఒక ఉచిత సలహా పడేశారట. 

అయ్యా! ఆవిధంగా "పోలీసుచర్య"కైన ఖర్చులు విద్యాశాఖ భరించింది.

P.S.: హైదరాబాదులో హిందువులెక్కువ, రాజుగారు పాకిస్థాన్‌లో కలపాలనుకున్నారు. భారతప్రభుత్యం "చెల్లదు ఫో" అంది. కరష్ట్!! కష్మీర్‌లో ముస్లిములెక్కువ, మరి రాజుగారు Letter of Accession ఇచ్చినప్పుడు ఎలా ఒప్పేసుకున్నారు? (by the way అది ఫోర్జరీ పత్రమట. ఈ ఘనకార్యాన్ని నిర్వర్తించింది పటేల్‌గారే నని చెబుతారు).