
నెట్‌ఫ్లిక్స్ పుణ్యమాని ఇవ్వాళ ఈ సినిమా చూడగలిగాను. లేకుంటే ఇలాంటి సినిమాలు మనం ధియేటర్లలో ఎక్కడ చూడగలం?!
సినిమా చాలా సాదాగా, ప్రశాంతంగా బల్లకట్టులా సాగిపోతుంది. ఉక్కిరిబిక్కిరిచేసే ఉద్వేగాలు, కన్నీళ్ళుపెట్టించే, బీపీలుపెంచే, చప్పట్లుకొట్టించే సీన్లు ఎమీలేవిందులో. ఐనా సినిమా చూశాక, ఒక మంచి సినిమా చూశామన్న ఆనందం మిగిలిపోతుంది చూసినవాళ్లలో.
ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జక్టుని నాలుగుసార్లు ఫెయిలయ్యి, చికాకులోనూ, జీవితగమ్యం తెలియని అయోమయ అవస్థలోనూ ఉన్న రాజు, తనతండ్రికి గుండెనొప్పి రావడంతో, తండ్రి బదులుగా తను అపార్ట్మెంట్లో చేసే లిఫ్ట్‌బాయ్‌గా ఒక మూడువారాలు పనిచేయాల్సొస్తుంది. 'ఈ మూడువారాల సమయంలో అతనికి కలిగిన పరిచయాలు ఏమిటి, అతనిలో కలిగిన మార్పులేమిటి, అసలా పరీక్ష ఎలా పాసయ్యాడు, అయ్యాక ఏమయ్యింది, అతను తన కొత్త స్నేహితులకు చూపిన దారి ఏమిటి' ఇదీ కధ. సినిమాలో ఓచోట Mrs. D'souza చేత చెప్పించినట్లుగా 'గమ్యం ముఖ్యంకాదు. ప్రయాణమ్మాత్రమే ముఖ్యం' అని చెప్పడమే సినిమా లక్ష్యం. ఆముక్క చెప్పడానికి ఈ కధను ఎంచుకోవడం చాలా గొప్పవిషయం. Background musik చాలా చక్కగా కుదిరింది. ఇంత ఆరోగ్యకరమైన సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయ్.