ఈ కరోనా వైరస్ నేపధ్యంలో ఇతర దేశాలకి నిజమైన సహాయం (చైనా మార్కు సహాయంకాదు) చేస్తున్న దేశాలు నాకు తెలిసినంతవరకూ మూడు. అవి ఇండియా, క్యూబా, జర్మనీ. ఇండిక్ష్యా ఏమో మందులనీ, కొన్ని వైద్య పరికరాల్నీ ఇటలీ, జర్మనీ, చైనాలాంటి దేశాలకు ఇదివరకే పంపించింది. క్యూబా ఎలాగూ వాళ్ళ డాక్టర్లతో దేశాలను ఆదుకుంటుంది. జర్మనీది మరో కహానీ. వీళ్ళకి పీక్‌స్టేజ్‌లో కేసులున్నప్పుడే, ఇటలీ, ఫ్రాన్స్‌లనుండి క్రిటికల్‌గా ఉన్న రోగులను ప్రత్యేక విమానాల్లో జర్మనీకి పట్టుకొచ్చి నయం చెయ్యడం మొదలుపెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళకి తగినన్ని కేసులు లేవంజెప్పి, డాక్టర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఉంటుందికదా అని ఏకంగా కష్టతరమైన కేసుల్ని ఏరుకు తెచ్చుకున్నారు. సమాఖ్య స్ఫూర్తి అంటే అది!
ఈ యవారమమంతా మొదలవడానికి ముందు జర్మనీ రోజుకు 16,000 పరీక్షలు నిర్వహిస్తుంది. ఆనాడే మెర్కెలమ్మ చెప్పేసింది "అవసరమైతే ఆ సంఖ్యను పెంచగలంకూడా" అని. ప్రస్తుతం వీళ్ళు ప్రస్తుతం రోజుకు 50,000 చేస్తున్నారు. ఈమధ్య గంట, రెండుగంటల్లో పరీక్షలు చెయ్యగల టెస్ట్‌కిట్స్ వచ్చాయి. అవికూడా అందుబాటులోకి వస్తే, ఇక పరీక్షలు నిర్వహించడంలో జర్మనీ విశృంఖలతకు అడ్డూఆపూ ఉండదు. ఈ యవారమంతా ముగిసాక herd immunity సంగతి asses చెయ్యడానికి సిధ్ధమవుతున్నారు.
జర్మనీ ఇలా manageable conditionలో ఉండడానికి కారణాలు: 1) ప్రభుత్వం ఆలస్యంగా నిద్రలేచినా, సమస్య తీవ్రతను సరిగా అర్ధంచేసుకొని స్పందించింది. 2) ప్రజల సహకారం. మొదట్లో కొందరు మూర్ఖులు lock downని తోసిరాజని బేస్‌మెంట్స్‌లో పార్టీలు నిర్వహించినా, ఒకవారానికి అందరికీ పరిస్థితి అర్ధమయ్యింది. మ్యూనిక్‌లో ఐతే షాపుల్లో, రెస్టారెంట్లలో చాలా ఖచ్చితంగా Abstand అనబడే "ఎడం"ను పాటిస్తున్నారు. చిన్నచిన్న షాపుల్లోనైతే... షాపులో ఎంతమంది ఉండాలి అన్నవిషయం షాపువాళ్ళే నియంత్రిస్తున్నారు. గవర్నమెంటు "ఇలా చెయ్యండి బాబూ" అనేమీ చెప్పలేదు. జనాలకు పరిస్థితి బాగా అర్ధమయ్యింది. Health systemకూడా చఖ్ఖగా ఉంది. కరోనా రోగులక్కూడా డాక్టర్లే ఇంటికివచ్చి మందులిచ్చిపోతున్నారు. పరిస్తితి ముదిరితేనే ఆసుపత్రులూ అవీ. వీళ్ళకు కలిసొచ్చిన మరొక అంశం ఇక్కడ ఇంట్లోనే క్వారంటైన్ అవ్వడం సాధ్యమవుతుంది. ఇండియా, బంగ్లాదేశ్ లాంటిదేశాల్లో ఇది చాలా కష్టం.
ప్రస్తుతం జర్మనీ పరిస్థితి ఏంటంటే నిన్న కొత్తగా వచ్చిపడినవి 2,400 కేసులు (ఇంత చిన్న సంఖ్య మార్చి 17న కనిపించింది). కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య నాలుగు రోజులుగా అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. ఇక్కడ ప్రస్తుతం కొత్తకేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే ట్రెండ్ ఇంకొన్ని వారాలపాటు కొనసాగితే బాగుణ్ణు. ఆతరువాతెలాగూ జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్, స్పెయిన్‌లకు సహాయం చెయ్యగల స్థితిలో జర్మనీ ఉంటుంది. అటుపక్క ఇండియాకూడా తొందరగా కదిలి ఇలాంటి అద్భుతాన్ని సాధిస్తే, చుట్టుప్రక్కలున్న దేశాలు ధైర్యంగా ఉండగలుగుతాయ్. ఎటొచ్చీ "మేము బాగుపడిపోయాం. ఇహ మీ చావు మీరు చావండి" అనే యెదవ లక్షణం ఇండియాకు ఎన్నడూ లేదు.