Tuesday, May 28, 2019

ఫుడ్డు ఫెస్టివలు - సంయమనము - భద్రత



మొన్న శనాదివారాల్లో మావూళ్ళో తిండి పండుగ జరిగింది. పేరుకే తిండిపండగ్గానీ, రకరకాల రాజకీయ పార్టీలవాళ్ళూ, ఇంటర్నెట్టును ఉద్యమకారులూ, LGBT ఉద్యమకారులూ, ప్రకృతి ప్రేమికులూ, నాస్తికులూ, మానవతావాదులూ, చిన్నచిన్న వ్యాపారులూ ఒకచోట పోగయ్యారు. ఊరిని పచ్చపరచండి (అంటే తెలుగుదేశమనుకొనేరు. ఇది ఆకుపచ్చ) అంటూ మొదలైన ఉద్యమం ఇలా ఒక తిరునాళ్ళలాగా మారిందట. ఇక తిండి విషయమైతే చెప్పనఖ్ఖర్లేదు. హంగేరియన్ వంటకాలూ, అరబిక్ వంటకాలూ, మొరొక్కన్ వంటకాలూ, చైనీసు వంటకాలూ ఒకే వీధిలో దొరికాయ్. ఎప్పుడూ కార్లు తిరుగుతుండే ఆ వీధిలో రెండు కిలోమీటర్లవరకూ అన్నీ దుకాణాలే!

నాకు నచ్చిన విషయమేమిటంటే విభిన్న భావజాలాలవాళ్ళు అంతదగ్గరగా మసలుతూకూడా, గొడవలు పడకపోవడం. ఇక్కడిలా నాస్తికులు పాటలు పాడుకుంటున్నారా... దానికి ఎదురుగానే అరేబియన్ ఫుడ్డు స్టాలు. దానిక్కొంతదూరంలో "దేవుడెవరో మీకు తెలుసా?" అంటూ క్రైస్తవులు. దానిక్కొంత దూరంలో LGBT ఉద్యమకారులు. వాళ్లకి కొంతదూరంలో "ప్రభూ! నీస్థానము స్వర్గము. పార్లమెంటుకాదు", "మతానికి good bye చెప్పండి" అంటూ ఏకంగా ఒక బస్సు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదీ! (ఏకత్వం పదం ఇక్కడ సరికాదేమో. ఉన్నవాళ్లలో చాలామంది తమనుతాము జర్మనులుగా ఐడెంటిఫై చేసుకోలేనివారు. కానీ మనుషుల్లా ప్రవర్తించడం తెలిసినవారు). సహనశీలత అంటే ఇదీ! ఇలాంటిది ఇండియాలో ఎక్కడ జరిగినా సంస్కృతి పరిరక్షకులో, మనోభావాలవాళ్ళో, అభ్యుదయవాదులమని చెప్పుకొంటూ ఛాందసాన్ని చూపించుకొనే మహిళాహక్కులవాళ్ళో ప్రత్యక్షమైపొతారు. 2017లో ట్రంపుడు జెరూసలెంను ఇజ్రయేలు రాజధానిగా గుర్తించినప్పుడు ఫ్రాంక్‌ఫర్టులో పాలస్తీనీయులు ఒక పెద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఇలాంటివి ఇండియాలో బస్సులు, షాపులు తగలెయ్యడం, బందులు, రాస్తారోకోలూ చెయ్యడం, రాళ్ళు విసరడం వంటి fun-activitiesతో అంతమౌతాయి. ఇక్కడమాత్రం మొత్తం ప్రదర్శననీ పోలీసులు చుట్టుముట్టి (వాళ్లని రక్షించడానికో, వాళ్ళనుండి నగరాన్ని రక్షించడానికో తెలియదుమరి) జాగ్రత్తగా వీధుల్లో నడిపించారు.

ఇక్కడ ఇంకొక విషయమేంటంటే... గాంధీ కలలుగన్న స్వాతంత్ర్యం సిధ్దించేసింది. ఆడవాళ్ళే కాదు, అర్ధరాత్రనేకాదు ఎప్పుడైనా, ఎక్కడైనా ధైర్యంగా తిరగొచ్చు. గుడ్డలిప్పుకు తిరిగినా మహాఉంటే ఎవరైనా పోలిసులను పిలుస్తారేకానీ, హీరోగిరీ వెలగబెట్టరు. Shady placeగా చెప్పబడే Bahnhof Viertel (FRK)లొ రాత్రి రెండింటికి నడవాల్సొస్తే మొదట్లో భయపడ్డానుగానీ తరువాత తెలిసింది బెంగుళూరుకంటే, ఢిల్లీ, గుర్గావ్ లకంటే ఎన్నోరెట్లు మెరుగు ఇక్కడి పట్టణాలు అని (East or west, India is the best అని వాగే పిచ్చవెధవలికి ఒక్కసారి జర్మనీ చూపిస్తే, చచ్చినా తిరిగి ఇండియా వెళ్ళం అని మొండికేస్తారు. ఆమాటకొస్తే ఇండియా విడిచి వెళ్ళిన ఏఒక్కడూ తిరిగి రావాలనుకోడు - వాళ్ళబాబు ఏ రాజకీయాలతోనో, సినిమలతోనో, బడాబడా వ్యాపారలతోనో సంబంధమున్న బాపతైనతేతప్ప). అంటే మరీ రామరాజ్యం సిధ్దించిందని కాదు. ఇక్కడా అరుదుగా గొడవలూ, హత్యలూ జరుగుతాయి. కానీ అందులో తొంభై శాతానికిపైగా రెఫ్యూజీలూ, తూర్పుయూరోపు దేశాలవాళ్ళూ ఉంటారు. జర్మన్ల విషయానికొస్తే చాలామర్యాదగా వ్యవహరిస్తారు వ్యవహారం చెడితే మహాఉంటే కూకలేస్తారేగానీ, పొరపాటునకూడా చెయ్యెత్తరు. ఇంకో పదేళ్లతరువాత ఇలాగే ఉంటుందా? తెలీదు. ఇప్పటికే వీళ్ళు ఇబ్బడిముబ్బడిగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలనుండి "ముస్లిము సోదరు"లను ఇక్కడ సెటిలవ్వడానికి అనుమతిచ్చారు. వారి పధ్ధతులూ, నైతికత, "సహనం" అన్నదానికి వారిచ్చుకొనే నిర్వచనమూ వేరు. ఇలా తెచ్చిపెట్టుకోవడాన్ని నిరశిస్తూ PEGIDA ఉద్యమాలూ, far-right (దాదాపుగా RSS) ఐనటువంటి AfD ప్రాబల్యం పెరగడాలూ ప్రస్తుతం జరుగుతున్నాయ్. Köln, Hamburg లలో జరుగుతున్న సంఘటనలూ, వాటిమీద సోషల్ మీడియాలో నడిచే చర్చలూ చూస్తున్నప్పుడు ఒకింత భయమేస్తుంది. 

ఇక్కడి లా అండ్ ఆర్డరే మిగిలినవారికి శ్రీరామరక్ష.