Friday, August 10, 2018

ఫ్రెంచి రివల్యూషనూ, Mississipi bubble

1717లో మిస్సిస్సిపి అనే ఒక ఫ్రెంచి కంపెనీ, మిస్సిస్సిపి లోయను ఆక్రమించుకొని అందులో New Orleans నిర్మిస్తాము అని చెప్పి, అందుకుగానూ షేర్లను ఫ్రెంచి స్టాకు ఎక్స్చేంజిలో అమ్మడం మొదలుపెట్టింది.  కంపెనీ డైరెక్టరు John Law గారికి పదిహేనవ లూయీ గారితో మంచి సంబంధాలుండేవట. అయన అప్పటికే ఫ్రెంచి సెంట్రల్ బ్యాంక్‌కు గవర్నర్ జనరల్ అయ్యుండగా, లూయీ గారు ఆయన్ను దేశ ఆర్ధికమంత్రిగా కూడా నియమించి పారేశారుట. 1717లో వాళ్ళు చెప్పిన ఆ మిస్సిస్సిపిలోయలో బురదనేలలు, మొసళ్ళు తప్ప ఇంకేమీ ఉండేవి కాదుట. డైరక్టరూ, వారి ప్రచార సిబ్బందీ మాత్రం అక్కడ స్వర్గమే ఉందన్నటుగా కటింగులిచ్చారుట. ఉన్నదేమో స్వర్గము, అమ్ముతున్నదేమో ఆర్ధికమంత్రి ఇంకేం! డబ్బున్న ప్రతొక్కడూ వారు షేర్లు కొనడం మొదలెట్టారుట. 1717లో షేరు విలువ 500 లీవర్లుండగా అదికాస్తా ఆగస్టూ 1 1719 నాటికి 2,750 లీవర్లై కూచుందట. ఆగస్టు 30 నాటికి అది 4,100 లీవర్లుకాగా, సెప్టెంబరు 4 నాటికి అది 5,000 లీవర్లట. డిసెంబరు 2 నాటికి అది 10,000 లీవర్లవడంతో జనార్లు వెర్రెత్తినట్లు ఉన్నాస్తులు తెగనమ్ముకొని మరీ కంపెనీ షేర్లు కొనడం మొదలుపెట్టారట.

కొంతమందికి మాత్రం అనుమానమొచ్చిందట. షేర్లు మరీ ఇంత ఉబిద్రమైన ధరలకు ఎలా అమ్ముతున్నారు? ఒకవేళ మునిగిపోతే పరిస్థితేంగాను? అన్న అనుమానంతో వాళ్ళు తమ షేర్లను అమ్మడం మొదలుపెట్టారట. మార్కెట్లో ఎక్కువ షేర్లు సప్లయ్ లో ఉండడంతో ధర సాధారణంగానే తగ్గుమొహం పట్టింది. దాన్నిచూసి మరికొందరు అమ్ముకోవడంతో షేరు విలువ పతనం కావడం ప్రారంభమయ్యిందిట. కంగారెత్తిన John Law గారు డిమాండును మళ్ళీ పెంచడంకోసంగానూ, సాక్షాత్తూ సెంట్రల్ బ్యాంకుచేత షేర్లుకొనిపించడం మొదలుపెట్టారట. త్వరలోనే దానిదగ్గర డబ్బైపోవడంతో, ఆర్ధికమంత్రికూడా అయిన ఆపుణ్యాత్ముడు ఎక్కువ లీవర్లను ముద్రించమని ఆర్ధికశాఖకు ఉత్తర్వులిచ్చాడట. ఈ దెబ్బతో సహజంగానే మొత్తం ఫ్రెంచి ఆర్ధిక వ్యవస్థ ఈ బుడగలోకి వచ్చికూర్చుంది. కొద్ది రోజుల్లోనే షేరు విలువ 10,000 నుండి 1,000 లీవర్లకు చేరుకుని, తర్వాతపూర్తిగా చిత్తుకాగితం స్థాయికి చేరుకుందట. సెంట్రల్ బ్యాకు, రాజుగారి ఖజానాల్లో ఈ చిత్తుకాగితాలు తప్ప ఇంకేమో లేకపోవడంతో,రాజుగారు స్వయంగా ఎక్కువవడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సివచ్చిందట. మరి ఆప్పులు తీరడానికి డబ్బులెవరిస్తారు? జనాలేకదా! కాబట్టి జనాలమీద పన్నులు పెంచారు. అసలే "నిండామునిగాము మొర్రో!!" అంటుంటే ఈ పన్నుల తాటికాయేమిటన్నట్లు, తెలివైనవారు, తెలిసినవారు ముందే అమ్ముకోగా, మిగిలిన షేరుహోల్డర్లు మూకుమ్మడిగా ఆత్మహత్య జేసుకున్నారట.

ఈదెబ్బతో ఫ్రెంచి ప్రభువుల పరపతి తుడిచిపెట్టుకుపోవడంతో, వారికి ఏమాత్రం అప్పులు కావాలన్నా విదేశీ వడ్డీ వ్యాపారులు ఎక్కువ రేట్లు అడిగేవారట. ఇంగ్లీషువాళ్ళకుమాత్రం చవగ్గా అప్పులుదొరికేవట. అలా చవగ్గ వచ్చిన అప్పులతో ఇంగ్లీషువాళ్ళు సైన్యమూ, ఆయుధ సంపత్తీ సమకూర్చుకొని ఫ్రెంచి వలసలపై దాడులుచేసేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యమే 350,000 ఉండేదట. అది మొత్తం బ్రిటన్ సైన్యంకన్నా ఎక్కువట!  ఆ John Law అనే ఒక్కడు  చేసిన పనికి జనాలు చావడమేకాకుండా, ఫ్రెంచి సామ్రాజ్యమే నాశనమయ్యిందట.

లూయీ పదిహేనుగారి  మనవడు  పదహారవ లూయీ గారి హయాంలోకి వచ్చేసరికి ఆయన సంవత్సర బడ్జెట్టులో సగం అప్పులోళ్ళవడ్డీలకే సరిపోయేదిట. "ఏమిచేతురా దేవుడా!!" అంటూ ఆయన నూటయాభై ఏళ్ళుగా సమావేశంకాని Estates Generalను సమావేశపరిచాడు. తరువాతది చరిత్ర. టెన్నిస్ కోర్టు శపధమూ, బాస్టిల్ కోట పతనమూ, రక్తపాతమూ, భయం రాజ్యమేలడమూ, నెపోలియనూ. నెపోలియన్ కూడా ఇంగ్లీషు వర్తకులని "కిరాణావ్యాపారులు" అని ఎగతాళి చేసేవాడుట. చివరికా కిరాణవ్యాపారులే నెపోలియన్ తాటతీశారు.