అసలు ఈ సినిమాని బ్యానో, 'బుయ్‌కాట్టో' (buycott) చెయ్యాల్సిన అవసరం ఏంటసలు? అంతా మన political narrativeకు సరిపోతుంది. ప్రధాన పాత్రలన్నీ హిందువులు (అంటే 'మనవాళ్ళు' లేదా 'అసమదీయులు' లేదా 'స్వరాయివాళ్ళు' - పరాయికి వ్యతిరేకం) చేశారు. ఉన్న ఒక్క ముస్లిమూ (అనగా 'వేరేవాళ్ళు' లేదా 'తసమదీయులు' లేదా 'పరాయివాళ్ళు') రావణుడి పాత్రచేశాడు. ఘాట్టిగా మాట్లాడితే ఇదసలు రామాయణమే కాదు. రామాయణప్రేరితం మాత్రమే! 'ఆఒక్కటేనా Lord Of The Rings, Star Wars, Game Of Thrones Harry Potter కూడా కదా?!' అనే వాళ్ళకి సమాధానం ఇవ్వడం దండగ. ఇందులో మనకు నచ్చని ఒక వీరోయిను మనకి నచ్చే రంగుకట్టుకొని గెంతలేదు, మనకేమాత్రమూ నచ్చని పరాయిమతస్థుడు వీరోవేషం కట్టలేదు. 'తెలుంగు'లో అసలు నెపోటిజపు పోకడలేలేవు కాబట్టి ఆగొడవా లేదు. ఇంకేల మనకు సమస్య?
డవిలాగులా? మొదటి ప్రతిలో అమ్మన్నాబూతులు, నీకొడకా, నాకొడకా రాసుంటాడు మనోజుడు. తాగింది దిగినాక వాటిని ఈమాత్రం సభ్యంగా సరిచేశాడు. దానికి మనం సంతోషించాలేగానీ ఏడిసిఛస్తే ఎలాగ? ఆమాత్రం తెలివి లేనిది మనకే! రామసేనవాళ్ళూ, అలనాడు పద్మావత్(ఇ) సినిమా విషయంలో తలలు నరకమని ఫత్వాలు జారీచేసిన రాజపుత్ర సేనలూ నోర్మూసుకున్నప్పుడు మనకెందుకు గోల? కందకు లేని దురద కత్తికేల? అయినా ఇలా భిన్న ధ్రుక్పదంతో పుస్తకం రాస్తే తప్పుగానీ సినిమా అంటే కోట్లు!! అది ఆలోచించుకోవద్దూ! నటించినవాళ్ళలో మన తెలుగువాడున్నాడు కాబట్టి మనం కొన్నింటిని చూసీచూడనట్లు వదిలెయ్యాల. ఒకవేళ మనకులపోడైతే నెత్తినపెట్టుకోవాల. అయినా సినిమా తీసింది రంగనాయకమ్మకాదు.. రౌతు. కాబట్టి విమర్శించేముందు ఒళ్ళు దగ్గరుంచుకోవాల. డవిలాగులు రాసింది మన బీజేపీవాడు కాబట్టి మరింత జాగరూకతతో వ్యవహరించాల.
శ్రీరామా వైన్సు, పార్వతి వైన్సు, శ్రీవెంకటేశ్వర వైన్సు, శ్రీవివేకానంద వైన్సు (ఇదొకటి బెంగుళూరు 100 ఫీటు రోడ్డులో రైల్వేక్రాసింగు దగ్గర ఉండేది) లో నిక్షేపంగా తాగుతున్నామేగానీ బుయ్‌కాట్టుతున్నామా? మన సమస్య 'కరాచీ' బిస్కెట్లతోనేగానీ 'శ్రీరామా వైన్సు'తో కాదే! ఆమాత్రం సహనం ఇప్పుడుకూడా పాటించాలా వద్దా? రేప్పొద్దున ఎవడో ఏదేవుడి పేరు మీదనో మసాజ్ సెంటర్ నడుపుతాడు. అందులో ఏం జరుగుతోందో మనకూ తెలుసు. అలాగని మనం అభ్యంతరం చెబుతామా? ఇదీ అంతే.
'జై శ్రీరాం' అనుకుంటూ వెళ్ళి, నేలటికెట్టులో తేరగా సినిమాచూస్తున్న హనుమంతుడికి నమస్కరించి వద్దాం. అలాగే హాలుప్రక్కన ప్రభాసు కులస్తులు (అనగా అభిమానులు) ఉంటారు కాబట్టి... వాళ్ళతో హస్కేయడం ఆరోగ్యానికి హానికరం కాబట్టి... బేగి ఇంటికొచ్చేద్దాం.