ఆమధ్య ఒకపరి 'వీరసింహారెడ్డి: నా ఖొడక' నామధేయముగల (వి)చిత్రమును వీక్షించితిని. వొద్దులే అరగ్రాంధీకం వద్దు మామూలుగా చెబుదాం.
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
బాలకృష్ణ సినిమా కధ సాధింపరాదు
labhEta sikataasu tailaM api yatnataH peeDayan
pibEcca mRRigatRRishhNikaasu salilaM pipaasaarditaH ।
kvacidapi paryaTanshashavishhaaNaM aasaadayEt
na tu balakrishNa sinimaa kadham saadhayEt ॥
అని భర్తృహరి ఇంగ్లీషులో సుభాషితంగా చెబితే, దాన్ని దొస్తొయెవ్స్కీ తెలుగులోకి అనువదించిన విషయం గుర్తొచ్చింది. ఇదీ అంతే! కధలేదు కీకరకాయలేదు - ఉన్నా అదేందో చెప్పే సాహసం నేను చేయలేను. బోల్డన్ని త్రిప్పుళ్ళు (ట్విష్టులు) ఉన్నాయ్ కధవి మరియు వీరోయిను శిఖామణివీ. అయినా E.U. దేశంలో రోడ్డుమీద కత్తులేసుకొని పరిగెడతారా! పండ్లు కోసే బుల్లికత్తిని తీసుకెళుతున్నప్పుడు పోలీసులు మనఖర్మకొద్దీ మన బ్యాగు వెతికితే అప్పుడా కత్తి... బ్యాగు అడుగుభాగాన ఉండాలి. అలా లేకుంటే రక్షకభట మావయ్యలు మనచేత బిల ప్రవేశం గావిస్తారు (బొక్కలోతోస్తారని కవిహృదయం). అలాంటి దేశాల్లో ఈ సింహమూ, ఆ పాతికమంది గాడిదలూ రోడ్లమీద ఊరపందుల్లా పరిగెడుతూ కత్తులతో కోలాటం ఆడుకుంటుంటే పోలీసులూ, జనాలూ చోద్యం చూస్తారా. డైరెట్రుగాడికి మనోవికలాంగుల కోటాలో ఏదోఒకటివ్వండయ్యా. ఆ వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర అర్ధమైనవారు డిసర్టేషను రాసి పీహెచ్డీలు తెచ్చుకోవచ్చు సామీ. అంత గనంగా ఉండాదాపాత్ర.
ఈ మాత్రం గనానికి ఆయన రొండుగంటలా నలభయ్యెనిమిది నిముషాలు బాదినాడు. చూసిన బ్రీడుజనాలు యూఎస్సు అనబడే పల్లెటూళ్ళో చదువు, వయసు, సంయమనమూ మరిచిపోయి ఊరపందుల్లా రోడ్డెక్కారు! ఆఖరుకి ఒక ధియేటరువాడు చెప్పిచ్చుకుక్కొట్టినంత పనిచేశాడు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా మన బ్రీడుభారతిని ఇలాగే కొలుద్దాం! అయినా బ్రీడుమనోభావలు, చేష్టలు ఎప్పుడు ఎవరికి అర్ధమయ్యాయి కాబట్టి. తొంభైయేళ్ళొచ్చినా మన బ్రీడుప్రజలము ఇలాగే ఉందుము గాక!
అసలు తెలుగుసినిమాలో రెండున్నర గంటల కంటెంటు ఏముంటుంది? ఎందుకు దాన్ని తొంభైనిమిషాలకి కుదించకూడదు (మావాళ్ళీ మధ్య ఇరవైనిమిషాల్లో తెలుగు, హిందీ సినిమాలు చూసేస్తన్నారంటే చూడరూ మరి! ఎడిటర్లూ... వింటున్నారా)? ఏం ఇంగ్లీషువాళ్ళు తీయట్లేదా? మిగతా భాషలవాళ్ళు తియ్యట్లేదా? అసలా పాటలెందుకు? నిఝ్ఝంగా ఆ వీరోవీరోయిన్లు ఎమినెమ్ములూ, మరియా కేరీలూ ఐతే స్టేజెక్కి పాడండి. మేమూ సూత్తాం. ఈ బోడిమొకాలకి ఆస్టారూ, ఈస్టారూ అంటూ తోకలెందుకు? యీళ్ళు యీరోలా? ఏ యిదంగా? ఒక్కడన్నా యీళ్ళలో ఎప్పుడైనా గాల్లో యెగిరి సీపిచ్చినాడా? లంగాలుతప్ప ఇంకేమన్నా ఎత్తినారా? ఈళ్ళకవసరమా ఈతోకలు? పిల్లింజూసి పాంట్లు తడుపునే యీళ్ళకు ఫయిటింగులూ. ఈమధ్యే ఒకడు తిరుగుతున్నాడు వాడు 'ప్రపంచతోపు' అనుకుంటా... తెలింకనే ఆడగతండాగానీ... ప్రపంచతోపంటే ఏందబయా?