Saturday, March 5, 2022

పుతిను ఒంటెత్తు పోకడలు

 అసలీ యుద్ధమాపడానికి నీ షరతులేమిటోయ్ పుతినూ అనడిగితే, పుతినన్నాడటా.... USSR విడిపోవడానికి ముందు NATO ఎంతవరకూ విస్తరించి ఉన్నదో ఇప్పుడూ అక్కడకే పరిమితం కావాలీ అని. అంటే పోలండ్, ఎస్తోనియా, లాట్వియా, లుధువేనియాలు అర్జంటుగా NATO నుండి బయటకొచ్చేయాలి. అనుమానమే అఖ్ఖర్లేదు. అలా జరిగిన వెంటనే బాల్టిక్ దేశాలుగా వ్యవహరించబడే ఎస్తోనియా, లాట్వియా, లుధువేనియాలను ఒకే ఒక్కరోజులో ఆక్రమించుకుంటాడు. ఇవిగాక రొమానియా, బుల్గారియా, హంగరీ, ఆస్ట్రియా, స్లొవాకియా, చెకియా, స్లొవేనియాలు కూడా NATOలోంచి బయటకు వచ్చేయాలి లేదా NATOనే వాటిని బయటకు గెంటేయ్యాలి. ఇదిగాక ఆయా దేశాలన్నీ 1997 నాటిస్థాయికి నిస్సైనికీకరించబడాలట. ఇదసలు సాధ్యమా? అంటే బాబుగారేమో ఆధునిక సుఖోయ్‌లు, nuclear torpedoలూ, మిస్సైళ్లూ maintain చేస్తుంటే. ఆయన చుట్టూ ఉన్న దేశాలుమాత్రం ఇక్ష్వాకులకాలంనాటి ఆయుధాలు వాడుతూ ఉండాలట. పుతినులాంటోడు నా పొరుగునుంటే నేనుకూడా నాలుగు మిస్సైళ్ళు కొనిపెట్టుకుంటాను అలాంటిది ఆయా దేశాలవాళ్ళుమాత్రం కాషాయకమండలాలు ధరించి తిరగాలట. మరి జరుగుతున్నదేమిటీ? ఇప్పటిదాకా తటస్థంగా ఉన్న ఫిన్లాండు, స్వీడన్లలో ప్రజలు తమదేశాధినేతలపై NATOలో చేరవలసిందిగా వత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే అలా సరైన సమయంలో NATOలో చేరని యుక్రెయిను పరిస్థితి వాళ్ళిప్పుడు చూస్తున్నారు.


Lehman Brothers గురించీ అది కుప్పకూలడంవల్ల అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కలిగిన ప్రకంపనలగురించీ మనకు తెలుసు. ఇంతా చేస్తే అమెరికన్ GDPలో Lehman Brothers విలువ కేవలం మూడుశాతమట. ఇండియాలో SBIలాగా రష్యాలో Sberbank అని ఒక బ్యాంకుంది. దీని transactions విలువ రష్యా GDPలో ముప్పైశాతమట. ఇప్పుడా సోదెందుకంటే... ఇటీవల విధించిన ఆంక్షల నేపధ్యంలో ఈబ్యాంకు షేరువిలువ యేకంగా తొంభైయేడుశాతం పడిపోయింది. రేపోమాపో రష్యన్ ఎక్స్ఛేంజ్ తెరవగానే దాని షేరు విలువ ఇంకొంచెం పడిపోవచ్చు. ఒకవేళ ఈ బ్యాంకుగానీ మునిగిందా, రష్యన్ ఎకానమీ గోవిందా! గొహోవింద. దానివల్ల మిగిలిన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో అంటుకొనే మంటలగురించి ప్రస్తుతానికి పరిశోధన సాగుతోంది.


ఇదిలా ఉండగా రష్యాలోని Lukoilలాంటి సంస్థలు "యుద్ధం అపరా బాబూ" అని మొత్తుకుంటున్నాయట. ప్రజలూ ఈ యుద్ధం కోరుకోవడంలేదు. కొందరైతే ఇప్పటికే రోడ్లెక్కారు. ఇదిలాగే కొనసాగితే ప్రభువులవారికి సైనికపాలన విధించడం మినహా వేరే గతుండదు. అప్పుడిక పుతినులవారి దయ, రష్యన్ల ప్రాప్తమూ పైన రష్యన్ల జీవితాలు ఆధారపడుతాయ్. ఇది అర్ధమైన కొంతమంది ప్రజలు కార్లలో ఫిన్లాండు చేరుకుంటున్నారు. మామూలుగా ఐతే ఫిన్లాండు తటస్థంగా వ్యవహరించి రష్యన్లను వెనక్కు పంపించేసేది. కానీ ప్రభువులవారు ఈమధ్యే ఫిన్లాండుకు "నువ్వుగానీ NATOలో చేరాలని చూస్తే, నీకు రంగుపడుద్ది" టైపులో తాఖీదులు పంపారట. అదిచూసిన ఫిన్లాండుకు చిర్రెత్తుకొచ్చింది. మరీ రేపోమాపో కాకపోయినా త్వరలోనే ఫిన్లాండుకూడా NATOలో చేరుతుంది. ఐనా ప్రభువులవారు చెయ్యాల్సిందంతా చేశాక వాళ్ళు NATOలో చేరకపోతే ఆశ్చర్యంగానీ... మళ్ళీ వారే ఏడుస్తారు "NATO విస్తరిస్తోందో..." అని. అసలు ఐరోపా దేశాలు ఎంత కోపంగా ఉన్నాయంటే ఎప్పుడూ తటస్థంగా ఉండే స్విట్జర్లాండ్‌కూడా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఇంకా తటస్థంగా ఉంటున్నదల్లా అదిగో ఆ దక్షణాసియా దొంగలముఠాలోని మూడుదేశాలూను.


రష్యా ఆక్రమించిన ప్రాంతాలలో కొన్నింటిని యుక్రెయును సైన్యం విముక్తం చేస్తూ సాగుతోంది. ఇటు పుతినేమో మొత్తం యుక్రెయున్నీ ఆక్రమించుకొన్నాకనే వెనుదిరుగుతా అని ఈమధ్యే ఫ్రెంచి అధ్యక్షుడితో మంగమ్మశపధం లాంటిదేదో చేశాడట. ఇలా అయితే ఈ యుద్ధం చా.....లా.... కాలమే సాగేలా ఉంది. ఇంతా చేసి రష్యన్ల élite army divisions ఈ యుద్ధంలో పాలుపంచుకోవడంలేదట. మరి ఈ కోతికొమ్మచ్చిలాటదేనికో!


ఇహ యుక్రేనియన్ల పరిస్థితి. యూరోపియన్ దేశాలు యుక్రేనియన్లను సంతోషంగా స్వాగతిస్తున్నాయ్. బెర్లిన్‌లో Hauptbahnhofలో ప్రకార్దులు పట్టుకొని ప్రజలే "నలుగురికి మా ఇంట్లో ఆశ్రయమివ్వగలం", "ఒక తల్లి, ఒక బిడ్డకు ఆశ్రయమివ్వగలం" అని ప్రదర్శిస్తున్నారు.