ఒక చిన్న దేశం, తనమీద ఒక పెద్ద దేశపు దుర్మార్గాన్ని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇది అరుదైన విషయం, అపురూపమైన విషయం. ఇక ఐరాసలో మన ప్రభువులవారికి "రష్యా చేస్తున్నది తప్పు" అని చెప్పడానిగ్గానూ... రష్యాతో మనకు అవసరముందా, రష్యా మనకు ఇది వరకు సహాయపడిందా, యుక్రెయును మనకు ఎప్పుడైనా బాసటగా నిలచిందా అని లెక్కలు వేసుకుంటున్నారు. వేసుకొని, ఇవే లెక్కలు వేసుకుంటున్న పాకిస్తాను, చైనాల పక్కన సిగ్గులేకుండా నిలబడ్డారు. నైతికతకు సంబంధించిన విషయాన్ని లౌక్యపరమైనదిగా మార్చేశారు.
అంటే ఒకడు నాకు ఇంతకుముందు సహాయం చేసినంత మాత్రాన, నాకు ఇంకా వాడితో అవసరం ఉన్నంత మాత్రాన వాడు ఊళ్ళు దోచుకుంటున్నా నేను వాడినే సమర్ధించాలా? దొంగలను, హంతకులనూ సమర్ధించే వాళ్ళు దొంగలూ, హంతకులూ కారా? తటస్థత అనేది కేవలం ఒక మోసం. ఒక దుర్మార్గం జరుగుతున్నప్పుడు మనం తటస్థంగా ఉంటున్నాం అంటే మనం దాన్ని సమర్ధిస్తున్నట్లు. అ దుర్మార్గాన్ని నిందించడానిక్కూడా పనికిరాని నోరు ఉంటే ఎంత? పడిపోతే ఎంత? రేప్పొద్దున చైనా ఇండియాపై దాడిచేసినప్పుడు, మొత్తం ప్రపంచం ఇదే తటస్థత మంత్రం పఠిస్తే ఇండియాకు తిమ్మిరణుగుతుంది. అప్పుడెలాగూ ఇదే రష్యా "చైనా సోదరులకు" సహాయం చేస్తుందేగానీ, "భారత మిత్రులకు" కాదు. 1962లో నికితా కృశ్చెవ్ చెప్పింది, చేసింది ఇదే!
బలహీనుల పక్షాన నిలబడే చేవలేని దేశమేదైతేనేమి? అది ఉంటేనేమి? నాశనమైపోతేనేమి? నెహ్రూ ఉండుంటే, ఆయనకు రష్యా అంటే ఎంతటి అభిమానమున్నా ఈ విషయంలో యుక్రెయిను పక్షాన నిలబడుండేవాడు. మన సిగ్గులేనితనానికి తోడు యుక్రెయునుకు మానవతా సహాయం అందిస్తున్నామట. అంటే యుద్ధం కొనసాగుతూనే ఉండాలి. మానవతా సహాయమూ కొనసాగుతూ ఉండాలి. మన మంచితనం మనం డప్పు కొట్టుకుంటూ ఉండాలి. యుద్ధం ఆగరాదు సుమా! ధూ!