Thursday, September 22, 2022

పుతిన్: అభినవ హిట్లరువారు



హిట్లరు రష్యా మీదికి దండయాత్ర సన్నాహాలు చేస్తున్నప్పుడు. అందరు జనరళ్ళూ సమ్మతించారటగానీ ఒకానొక జనరల్ మాత్రం పొరపాటున కూడా ఆపనిచెయ్యొద్దు. ఒకవేళ చేసినా దానికిసమయం ఇదికాదు అని కరాఖండిగా చెప్పాడట. నాలుగొందలేళ్ళక్రితం నెపోలియన్ ఇదే పనిచేసి భంగపడిన విషయాన్నీ గుర్తుచేశాడట. ఆవిషయంపైన హిట్లరూ, జనరలూ వాదులాడుకొన్నారట కూడానూ ఒకానొక సమయంలో అరుచుకున్నారట కూడా. చివరకు హిట్లరే సోయులోకొచ్చి, నువ్వు చెప్పేదే కరెక్టు కానీ ఈసారికి నేను చెప్పిందే చేద్దాం అన్నాడట. చివరకు రష్యాపై యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. జర్మన్ సైన్యం అజేయం అనుకున్న పాశ్చాత్యదేశాల సైన్యాల్లో హిట్లరు రాక్షస సైన్యాల ఓటమి ఎంతో ఉత్సాహాన్ని నింపింది. 

ఇప్పుడు అది రష్యా విషయంలో నిజమయ్యింది. యుక్రెయినుపై యుద్ధాన్ని వ్యతిరేకించిన జనరళ్ళు రెండో రోజునుంచీ కనిపించడంలేదట. బహుశా వాళ్ళూ ఈపాటికే తమ తప్పు తెలుసుకొని కాళ్ళకు రాయి కట్టుకొని వోల్గాలో దూకుంటారు. లేదా స్వఛ్చందంగా రష్యన్ జైలు తలుపు తట్టుంటారు.

పాశ్చాత్య ఆయుధాల దెబ్బ రుచి చూశాక, తన గర్వము ఖర్వమయ్యాక ఇప్పుడిప్పుడే పుతినుకు విషయం బోధపడుతోంది. S400 ఉండగా ఎవ్వరూ మమ్మల్నేమీ చెయ్యలేరు అనుకూచుంటే, ఏకంగా S400నే ఏమార్చిన ఘటనలుకూడా ఈ యుద్ధంలో సంభవించాయ్! Moskva ship మునకతో Black sea fleet దిక్కులేనిదైపోయింది. యుక్రెయినేమో రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకుంది. మిగిలిన పుణ్యకార్యం పూర్తిచెయ్యడానికి దానికి మరికొంత సమయంకావాలంతే! కజాకిస్తాన్, చైనాలాంటి దేశాలు దూరం జరుగుతున్నాయ్. ఆఖరుకి మోదీకూడా మొన్న... అసలు నీమొహానికి యుద్ధమవసరట్రా అదీ ఈటైములో అని గుడ్డ కాల్చి మొహానేసొచ్చాడు. పుతిను ఒంటరైపోతున్నాడు.  సైన్యం వట్టిచేతులతో తిరిగొస్తే ప్రజలకి మొహంచూపించుకోలేక రాజీనామా చేయాల్సొస్తుంది. అప్పుడు పుతినును యుద్ధనేరస్తుడిగా విచారణ జరిపి ఉరితీస్తారేమో!

అందుకనే ఈమూడు లక్షలమందిని యుక్రెయునుకు తోలాలన్న నిర్ణయం (ఈమాట విన్న రష్యన్లలో కొందరు నిరసనబాట పట్టి రోడ్లెక్కగా, అధికులు చుట్టుపక్కల దేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేసుకుంటున్నారు). కానీ చిక్కల్లా ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమం ఎంత సత్వరంగా సాగినా... పూర్తికావడానికి కనీసం రెండుమూడు నెలలు పడుతుంది. అప్పటికైనా... తోలుతాడు సరే, చేతిలో ఏమిచ్చి పంపుతాడు? ముల్లుకర్రలా? లేక సుత్తీ, కొడవలీనా? రష్యన్ సైన్యాన్ని పునరాయుధీకరించడానికి కనీసం ఏడాది పడుతుంది. అప్పటికీ ఇవే ఆయుధాలు ఇవ్వాల్సుంటుంది. అప్పుడెంచక్కా రెండవసారి ఓడిన నియంతల జాబితాలో చేరతాడు. అందుకే ఈ రెఫరెండములు. రెఫరెండముల్లో నియంతలు ఎప్పుడూ గెలుస్తారు (అదేంటోగానీ నియంత ఎంత రక్తపిపాసియైనా, ఎంతటి మలపత్రాష్టుడైనా... వాడు వొద్దంటేవొద్దని నిన్నటివరకూ రొడ్డెక్కి రాళ్ళువిసిరిన జనాలందరూ కలిసి కనీసం 90% మార్కులకు తగ్గకుండా పాసుచేయించి దీవిస్తారు). అప్పుడు ఇప్పటివరకూ తనచేతిలో ఉన్న భూభాగాలన్నింటినీ రష్యాలో కలిపేసుకొని మొత్తంగా "ఇదీ proper Russia" అని చెప్పుకోవచ్చు. ఆతరువాత ఆయా ప్రాంతాలపై ఏ చిన్నదాడి జరిగినా అణ్వాయుధాలు ఉండనే ఉన్నాయి. అయ్యా! ఆవిధంగా ప్రస్తుతానికి ప్రపంచం అణుయుద్ధపు వాకిట్లో ఉంది. 

మరి పుతిన్ను దించేయొచ్చుకదా? అది ప్రస్తుతానికి సాధ్యమయ్యే వ్యవహారంలా కనిపించట్లేదు ఎందుకంటే పుతిను వ్యతిరేకులు రోజుకొకరు తగ్గకుండా పశ్చాత్తాపంతో తమనుతాము కాల్చేసుకోనో, కిటికీల్లోంచి దూకేసో చచ్చిపోతున్నారు పాపం. ఏ మిలిటరీ తిరుగుబాటో, మంత్రులతిరుగుబాటో, లేక 2014లో యుక్రెనులో Viktor Yanukovychకి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లాంటివి జరిగి ప్రజలే పుతిన్నుపట్టుకొని అలనాడు లిబియాలో కల్నల్ గడ్డాఫీని కొట్టిచంపినట్లు చేయడమో జరిగితే తప్ప ప్రస్తుతానికి దారుల్లేవ్!