అప్పుడెప్పుడో ఈనాడు చదువుతుంటే వింత పదాలు తగిలేవి. గుత్తేదారు అన్నపదం తొలిసారి విన్నప్పుడు అదేదో బూతుపదం అనుకున్నాను. ఇప్పటికీ నాకు కాంట్రాక్టరు అన్నపదానికి సమానార్ధకం "గుత్తేదారు" ఎలా అయ్యిందో తెలీదు. అప్పట్లోనే "విభాగిని"ని ఢీ కొని కారులో వాళ్ళు మరణించారు అని చదవగానే నా కోడి బుర్రలో బోల్డు డౌటనుమానాలు "జ్యామెట్రీ బాక్సును రోడ్డుమీద వదిలెయ్యడమేమిటి? దాన్ని ఢీకొని కారులోవాళ్ళు చచ్చిపోవడమేమిటీ" అని. కాసేపటికి తట్టింది విభాగిని అంటే డివైడర్ అని. గగనసఖి అనేది ఇంకో తెగులు పదం. కొన్నాళ్ళు వాయు సేవకి అని ప్రయత్నించారనుకుంటాను. ఇదిలా పోతే ముందుముందు కలెక్టరును "మహామండల కరగ్రాహిని" అని, Executive officeerను "కరగ్రాహక అభియంత" అనీ అనువదించే రోజులుకూడా దగ్గర్లోనే ఉన్నాయ్. ప్రస్తుతానికైతే "బాహ్యవలయ రహదారి", "అంతర్వలయ రహదారి" చూడలేక ఛస్తున్నాం. ఇక కంప్యూటర్ వార్తలు చదివితే జుట్టుపీక్కుంటాం. "అనువర్తనము" అనేది appకి వచ్చిన ఖర్మ. Big Dataను "భారీదత్తం" అని అనువదించాడో ప్రబుధ్ధుడు.
మరి అంత ప్రమాణాలు పాటించే పత్రికలోనే "పాలాభిషేకం" అని రాస్తారు. పాలాభిషేకం ఏమిటి? ఈలెక్కన మిల్కాభిషేకం అనికూడా రాసుకోవచ్చా? రెండు వేర్వేరు భాషా పదాలను ఎవడైనా ఒకపదంలా సంధిస్తాడా?
ఇదంతా చదివాక రావికొండలరావుగారు పంచుకున్న ఒక ముచ్చట గుర్తుకొస్తుంది. ఒకాయనకి ఇంగ్లూషు అంతగా రాదుకాబట్టి సాధ్యమైనంత తెలుగులో రేపు ఆయన తిరుపతిలో షూటింగ్ కి హాజరవ్వాలి అన్న విషయం చెప్పమంటే తెలుగు ఎక్కువ తెలిసిన ఒకాయ ఇలా రాసాడంట : "రేపు మనకు తిరుపతిలో కాల్పులు. కాల్పుల్లో మొదటి దెబ్బ మీమీదనే!" అని రాసి పంపించాడట.