ఆమధ్య ట్రంపుడు ఇరానుతో ఒబామా హయంలో చేసుకొన్న ఒకానొక ఒప్పందాన్ని "చెత్త"గా అభివర్ణిస్తూ, దాన్ని ఏకపక్షంగా బుట్టదాఖలుచేశారు (అనగా బ్రీచారు -breach). ఆ సందర్భాన్ని ఇరానియన్లు అమెరికా జెండాను అదేదో బీడి ముక్కన్నట్లు కాల్చిపారనూకడం ద్వారా సెలబ్రేటు చేసుకున్నారు). అది చాలదన్నట్లు ఈమధ్య ఇరానియను ప్రెసిడెంటుగారు "మా యురేనియం ఉత్పత్తి వేగం చూస్తుంటే మేము ఫలానా అంతర్జాతీయ ఒప్పందాన్ని ఫలానా రోజున బ్రీచగలమనిపిస్తోంది" అని వాకృచ్చారు. వెంటనే ట్రంపుడు గారు ఆయొక్క అంతర్జాతీయ ఒప్పందాన్ని బ్రోచవలసిన అవసరం యావత్ప్రపంచదేశాలకూ ఉన్నదని గుర్తుచేస్తూ ఱంకెలువేశారు. అది చాలక పుండు మీద ఆసిడ్ రాసినట్లు ఇరానులవారు ఈమధ్య ఇంకోసారి ఆ యురేనియంతో తాము ఏం చేయదలచుకుంటున్నదీ వివరించారు(నాకు తెలిసినంతవరకూ యురేనియంతో గొడుగులూ, సైకిళ్ళూ, వంటపాత్రలూ చెయ్యరు). అప్పటికే యుధ్ధమేఘాలు అలుముకొనుండగా, ఒకానొక శుభదినాన ఇరానులవారు అమెరికన్ నౌకలకు కన్నం వేయడమూ, ఏకంగా వారి డ్రోనులను కూల్చివేయడమూ చేశారు(ఇది బొత్తిగా మర్యాదలేని వ్యవహారమని నా అభిప్రాయం. ఇండియా వారుకూడా పాకిస్తాను విమానాలను కూల్చుతారేగానీ, అమెరికా విమానాల విషయంలో ఒళ్ళుదగ్గరుంచుకొని ఆగ్రహాన్ని మాత్రమే వ్యక్తం చేస్తారు). ఇరానుకు ప్రస్తుతం బ్రిటీషువారితో చేతలయుధ్ధం కొనసాగుతున్నది. మొన్నొకసారి చేసిన ప్రయత్నంలో వెనుదిరిగినా, అదే ప్రయత్నం మరొకసారి జరగదన్న గ్యారంటీ ఏమీలేదు.
అసలు ఏం జరుగుతోంది? ఉదిక్కుమంటే యుధ్ధానికెళ్ళే అమెరికా ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది? చిత్తమొచ్చినట్లు మాట్లాడే ట్రంపుడు కూడా, ఆ విమానాన్ని కూల్చాక, "ముందు ఇరానుపైకి దాడినాదేశించినా, కలలో కనిపించిన దివ్య పురుషుడు 150 ప్రాంతాల ప్రజలు నష్టపోతారని చెప్పడంవల్లే చివరిక్షణంలో నేను దాడిని ఆపు చేయించాను" అని చెప్పుకొచ్చాడు (కెమిస్త్రీలో అవగాడ్రో నంబరులాగా... ఈ 150ని ట్రంపు నంబరుగా వ్యవహరించాలనేది నా అబిప్రాయం). ఆఖరుకి బ్రిటనుకూడా దాడిచెయ్యబోయేవాళ్లను బెదిరించిందేగానీ, అంతకుమించి ఇంకేం చెయ్యడానికీ సాహసించలేదు. ఏమా మర్మము? దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవలసింది జూనియర్ బుష్‌గారికి. ఆయనగనుక ఇరాకుమీద యుధ్ధం చేసి అమెరికాకు తగిన పాఠాలు నేర్పకుంటే, ట్రంపుడు ఈపాటికి ఇరానుమీద దాడి చేసితీరుండేవాడు. ఇరాకు యుధ్ధం నెలల్లో ముగుస్తుంది, మరియు దానికి మహావుంటే 5 బిలియన్లు ఖర్చౌతాయి అని చెప్పింది బుష్ప్రభుత్వం. తీరా అది దాదాపు పదేళ్ళపాటు సా.....గింది. ఐన ఖర్చు రమారమి 1 ట్రిలియనట (1.1 trillions is the official figure) అనగా రెండొందలరెట్లు ఎక్కువ ఖర్చయ్యిందన్నమాట. ఇలాంటి విజయాన్నే Pyrrhic Victory అంటారు. అది ఇరాకు గొడవ. మరి ఇరానో? ఇరాను ఇరాకు కంటే పెద్ద దేశము, బలమైన దేశము. మంచి వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. యుధ్ధమంటూ మొదలైతే హార్మూజ్ జలసంధి మూసుకుపోతుంది. హార్మూజ్ జలసంధి నుంచి ప్రపంచమ్మొత్తానికి అవసరమైన దానిలో ఐదవవంతు చమురు రవాణా అవుతుంది (రోజుకు 19 మిలియన్ బ్యారళ్ళు. హార్ముజ్ తరువాత స్థానం మలక్కా జలసంధిది - రోజుకు 16 మిలియన్ బ్యారళ్ళు). హార్ముజ్ మూసుకుపోతే దాని ప్రభావం ప్రతిదేశంపైనా పడుతుంది (పెట్రోలు ధరలు పెరుగుతాయ్. దానివల్ల బాగుపడేది పెట్రోలియం ఉత్పత్తిచేసే కంపెనీలు మాత్రమే. అమెరికాలోని ఈ కంపెనీలే ప్రస్తుతం యుధ్ధం జరగాల్సిందేనని లాబీయింగ్ చేస్తున్నాయ్). దానివల్ల తీరా యుధ్ధం మొదలయ్యాక, ఈ పెట్రోలు ధరల సెగ తగిలాక, ఇప్పుడు అమెరికాకు వత్తాసు పలికినదేశాలే బాహాటంగా అమెరికాను విమర్శించి, ఇరానును సమర్ధించే అవకాశాలున్నాయనేది అమెరికాకు బాగా తెలుసు (పోయిన ఇరాకు యుధ్ధంలోనే జర్మనీ, ఫ్రాన్సులు అమెరికాను "దొబ్బెయ్!' అన్నాయి).
అమెరికా యుధ్ధం చేసేనాటికి సద్దాముడు ఐరాస ప్రాపుకోసమని తన ఆయుధాలు తానే నాశనం చేవ్సుకొని జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనే స్కూలుపిల్లాడిలా చేతులుచాచి నుంచున్నాడు. ఇరానెప్పుడూ "ఢీ" అంటే "ఢీ" అన్నదేగానీ, ఏనాడూ అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకున్నది లేదు. ఇరాను నిర్మించిన అణుకర్మాగారాలు "కుటీర పరిశ్రమ"ల బాపతట -పరిమాణంలో చిన్నవి, దాచడం సులువు. ఒకమోస్తరు దాడిచేసి వెనక్కెళ్ళిపోదామా అంటే ఇరాను అణుపాటవం సంపాదించడానికి కావలసింది కేవలం మరో నాలుగేళ్ళట. అలా కాకుండా నివారించాలంటే అమెరికా ఇరాన్ను కొన్నేళ్ళపాటు సైనికంగా తన అదుపులో ఉంచుకోవాలట. ఇరాకు యుధ్ధానుభవాల నేపధ్యంలో అమెరికా అంతటి సాహసానికి పూనుకొంటుందనుకోను. అసలు విషయం ఇవేవీకూడా కాదు. సైనిక సంపత్తి విషయంలో ఇరాను అమెరికా అంతటి పుడింగి కాకపోయినా ఇరానుకు ఇప్పటికే వివిధ దేశాల్లో గూడచారివ్యవస్థలూ, తీవ్రవాదుల స్లీపింగ్ సెల్సూ, ఇరాను చెప్పినట్లు తలాడించే కొన్ని సంస్థలూ ఉన్నాయట-ఆఖరుకు ఇరాను సాంప్రదాయక శత్రువు సౌదీలోకూడా! (ఈ విషయంలో సద్దాముడు బొత్తిగా అమాయకుడు. ఆయనకూడా ఇలాంటి వాటిని ఏర్పరచుకొనుంటే ఇరాకుయుధ్ధం మరోలా ఉండుండేది). ఇప్పుడు యుధ్ధమే మొదలైతే సాక్షాత్తూ అమెరికన్ సైన్యమే హిజ్బొల్లా తీవ్రవాదులతోనూ, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్‌తోనూ పోరాడాల్సొస్తుంది. అమెరికాకు సహాయంగా యుధ్ధంలోకి దిగిన దేశాల్లో తీవ్రవాద దాడులూ పెరగొచ్చు. సౌదీ ఎన్నటినుంచో భయపడుతున్నట్లు ఇరాన్ సౌదీలోకి బాహాటంగా తన ఇస్లామిక్ విప్లవాన్ని ఎగుమతి చెయ్యొచ్చు. అప్పుడు ఈ రెండు దేశాలుకూడా ఇప్పటిదాకా అనుసరిస్తున్న ప్రఛ్ఛన్న యుధ్ధవిధానాన్ని వీడి ప్రత్యక్షయుధ్ధానికి దిగాల్సిన పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ఇప్పటికే వీరివురూ ప్రఛ్ఛన్న యుధ్ధాలు చేస్తున్న సిరియా, ఇరాక్, యెమెన్, లిబియా దేశాల్లోని పోరాటాలు మరింత ఉధృతమౌతాయి. అప్పుడు ఏకంగా సౌదిలో ఈజిప్టు తరహా విప్లవం వచ్చినా, బహ్రెయిన్లో గతంలో అణగదొక్కబడిన ప్రజాస్వామ్య పోరాటం మళ్ళీ తలెత్తినా ఆశ్చర్య పోనఖ్ఖర్లేదు. అటుపక్క ఇజ్రాయెల్‌పైనా దాడులు పెరుగుతాయి. ఈ గొడవ నేపధ్యంలో ISIS భూతం మళ్ళీ జీవం పుంజుకొంటే అదింకో తద్దినం. ఇలాంటి బహుముఖ యుధ్ధాలు(war on multiple fronts) చేసిన మూర్ఖుడు ఒక్క హిట్లర్ మాత్రమే! అయన అడుగుజాడల్లో నడవడానికి అమెరికా ఇష్టపడకపోవచ్చు. ట్రంపుడుడి పాపులారిటీ అసలే స్వదేశంలోకూడా లేదు.
నాకు తెలిసినంతవరకే ఇన్నున్నాయ్ ఈ యవారంలో. అందుకే అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. అయినా యుధ్ధం ఎప్పుడూ మంచిదికాదు. మూర్ఖులే యుధ్ధాలు చేస్తారు. తెలివైనవాళ్ళు మార్కెట్లు పంచుకుంటారు.