Friday, June 7, 2019

నారాయణ!! నారాయణ!!


Courtesy : ముచ్చట

విజయం అన్న పదాన్ని డబుతోనూ, డబ్బు సంపాదించడనికి సన్నధ్ధతగానూ నిర్వచించడంతోనే మన పతనం మొదలయ్యింది. అవసరాలకూ... కొండుకచో విలాసాలకూ డబ్బు అవసరమే. కానీ ప్రస్తుతం మనం చేస్తున్నది అదికాదు. అందరికంటే మనకే ఎక్కువ డబ్బుకావాలి. అది. అక్కడే వచ్చింది చిక్కంతా! అందరి కార్లకంటే మనకారు వేగంగా పోవాలి. ఎక్కువ మైలేజీ ఇవ్వాలి. అందరి గేదెలకంటే మన గేదె ఎక్కువ పాలివ్వాలి. అందరి పిల్లకంటే మన పిల్లలు ఎక్కువ డాలర్లివ్వాలి. అలా డాలర్లివ్వాలంటే వాడికి కేవలం ఒక మంచి కాలేజీలో సీటొస్తే చాలదు. మంచి కాలేజీలో, మంచి సీటు (మొదటి వరుసలో మధ్యసీటు లాంటిదేదో) రావాలి. అలా రావాలంటే వాడు చచ్చైనా సరే మంచి ర్యాంకు సాధించాలి. వాడు అలా సాధించాలంటే మనం వాణ్ణి సాధించాలి. అంతలా సాధించబడినా వాడు పెద్దయ్యాక "అమ్మటే మెరిసే మేఘం... నాన్నంటే నీలాకాశం..." అంటూ పాటలు పాడుకుంటూ "చంటి"లో వెంకటేషులాగా తయారవ్వాలి. దానిని అత్యాశ అనరాదు. దానినే దార్శనికతతో కూడిన ప్రేమ అందురు.

ఈ అద్భుతాన్ని మనకు సాధించి పెట్టేవాటినే కోచింగు సెంటర్లు అందురు. ఒకప్పుడు గుంటూరు, నెల్లూరు, ఒంగోలుల్లో తట్టెడుండేవి. ఒకప్పుడు ఇవి కేవలం కోస్తా జిల్లాల్లోనే ఉండడంతో... తెలంగాణనుండి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి ఈ కోచింగు సెంటర్లలో కోచబడుతుండేవారు (అప్పట్లో మా కోళ్ళఫారంలో కొన్ని కోళ్ళు నేపాల్నుండొచ్చినవికూడా ఉండేవి). ప్రస్తుతానికి ఒంగోలు పూర్తిగా ఈ విషయంలో వెనుకబడిపోయినందున, గుంటూరు, నెల్లూరు నందు మొదటగా గుర్తించబడిన ఈ విద్యాసంస్థలు ఎబోలా వైరస్‌లా వ్యాపించి ఒక్క ఆంధ్ర విద్యార్ధులనేగాక, ఉత్తరాది విద్యార్ధులనుకూడా భయాందోళనలకు గురిచేస్తున్నాయని ప్రస్తుతం తెలుస్తోంది. వీళ్ల ర్యాంకుల వ్యహారాన్ని ముచ్చట.కాం వారు గట్టిగానే ఎండగట్టారు. అలాంటి వానజల్లులు దున్నపోతుల్లాంటి తెలుగు తల్లిదండ్రులమీద అంతగా పనిచేస్తాయని నేననుకోను. మనదంతా వేలంవెర్రికదా! పైగా ప్రస్తుతం మన వేలంవెర్రి ఎల్కేజీ లెవల్లోనే కనబడుతుంది. "నా కొలీగులందర్లోకీ నా కొడుకే ఎక్కువ ఖరీదైన కిండర్‌గార్టెన్‌లో చదువుతున్నాడు" అన్నది ఈనాటి తల్లిదండ్రులకు ఫ్యాషన్ స్టేట్మెంటు.