Friday, January 18, 2019

The Propaganda

2011-2012 ల్లో మొదటిసరిగా అనాహజారే అనుచరుడిగా కేజ్రీవాల్ పేరు దేశప్రజలు విన్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒకప్రక్క కేజ్రీవాల్ అర్హతలను రాహుల్ గాంధీ అర్హతలతో పోల్చుతూ పోస్టులు వెల్లువెత్తాయి. ఏవిధంగా కేజ్రీవాల్ ప్రధానిగా రాహుల్ కంటే అన్నివిధాలా అర్హుడోనన్న విహయం కేజ్రీవాల్ అర్హతలను ఏకరువుపెడుతూ దేశప్రజల జ్ఞానాన్ని పెంచేవిధంగా హిందూత్వవాదులు కృషిచేశారు. ఒకవేళ కేజ్రీవాల్ బీజేపీలో చేరిపోయుంటే ఆయన్ను ఆకాశానికెత్తేసుండేవారు. అయ్యేయస్ ఉద్యోగాన్ని వదులుకొని దేశసేవలో తరించజూస్తున్న ఈ విద్యాధికుడు అందరికీ ఆదర్శంకావాలని హిందూభక్తులు విపరీతంగా అభిలషించారు. ఆయనేమో కొత్తపార్టీపెట్టి, బీజేపీకే ఎదురునిలచాడు ఎన్నికలబరిలో. అంతే! ఒక్కసారిగా కేజ్రీవాల్ అహంభావి, అనుభవంలేనివాడు, హజారేద్రోహి ఇలా దిగజారిపోయాడు పాపం. ఇంకొన్నేళ్ళు గడిచేసరికి... ఏవిద్యార్హతలనైతే చూసి కొనియాడారో, తనకున్నాయని రాహుల్ చెప్పుకొంటున్న విద్యార్హతలను ఋజువుచేయమని బీజేపీ రాహుల్‌ను డిమాండ్ చేస్తున్నట్లుగానే, కేజ్రీవాల్ మోదీ విద్యార్హతలను ప్రశ్నించేసరికి "వీడెవడు మోదీని అడగడానికి?" అంటూ వెటకారం మొదలుపెట్టారు.  

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా... వివిధ దేశాల్లో పెట్రోలు ధరలను పోల్చుతూ "అన్నిదేశాల్లోకన్నా ఇండియాలోనే పెట్రోలు ధరలెక్కువ, ఇదంతా కాంగ్రేసు నాయకులు వాళ్ల జేనులునింపుకోవడానికి ఉపయోగపడుతోందేతప్ప ఇంకెందుకూ కాదు. ఈ దోపిడీకి అంతులేదా?" అన్నట్లుగా బ్లాగుల్లో, ఫేస్‌బుక్కుల్లో పోస్టులు దర్శనమిచ్చేవి. ఇదిగాక పడిపోతున్న రూపాయి విలువహురించి, "స్విస్ బ్యాంకులు భారతీయ నల్లకుబేరుల గురించి బయటపెట్టిన విషయాల" గురించీ పోస్టులు వెల్లువెత్తుతుండేవి. ఇవన్నీ అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధతలనూ, అవినీతినీ ఎత్తిచూపుతూ సాగేవి. అదేంటో ప్రభుత్వం మారినా ఆయా సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ పోస్టులు ఇప్పుడు మాత్రం వెదికినా కనబడవు.

నెదర్లాండ్స్ ప్రధానిగారు తన కార్యాలయానికి సైకిలు తొక్కుకుంటూ వెళ్లేవారట. అప్పట్లో ఆ బొమ్మలు విపరీతంగా ఫేస్‌బుక్కులో కనబడేవి. కాన్వాయిలేకుండా బయటకు కాలైనా పెట్టలేని, కాన్వాయికి డబ్బులనూ, ప్రజల సహనాన్నీ బలిపెడుతున్న అప్పటి రాజకీయ నాయకులతో, నిరాడంబరుడైన నెదర్లాండ్స్ ప్రధానిని పోల్చి, ఒక subtle message ని ప్రజలకు చేరవేయడమే ఆయా పోస్టుల ఉద్దేశ్యం. నెదర్లాండ్స్ ప్రధాని ఇప్పటికీ సైకిలుతొక్కుతూ వెళుతున్నారు. భరత ప్రధానిగారు ఇప్పటికీ కాన్వాయితోనే వెళుతున్నారు. పరిస్థితిలో ఏమార్పూలేదు అయినా అప్పటి పోస్టులు ఇప్పుడు కానరావు.

2014 ఎన్నికలకు ముందు మోదీ ఏవిధంగా అట్తడుగునుంచి పైకి వచ్చాడో వివరిస్తూ, ఆయన ఎక్కడో చీపురుతో నేలను ఊడ్చుతున్న ఒక పాతఫోటోని విస్తృతంగా సోషల్ మీడియాలో పాపులర్ చేశారు. తీరా మోదీ ఎన్నికైన తరువాత ఎవరో ఒక RTI కార్యకర్త "మీదీగారి ఆ ఫోటో ఎక్కడ, ఎప్పుడు, ఎవరితీశారు?" అని ఒక ప్రశ్న అడగ్గా, ప్రధాని నివాసం నుంచి దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది. అదేంటంటే... "అసలు అందులో ఉన్నది మోదీకాదు". 



ఇక పదిహేను లక్షలు అకౌంట్లలో వెయ్యడం సరేసరి (ఆర్ధికశాస్త్రంలో ఓనమాలు తెలిసినవాడెవ్వడూ ఎక్కువడబ్బు మార్కెట్లో ప్రవహించినంతమాత్రాన ప్రజలు ధనవంతులైపోతారు అని నమ్మరు. కానీ ఆబుధ్ధి ఓటేసినవాళ్లకు లేకపోయింది). ఎన్నికల యేరుదాటాక వాగ్దానాల తెప్పను తగలెయ్యడం ఇక్కడ చూడొచ్చు.


ఇదే తంతు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ, డీమానిటైజేషన్ విషయంలోనూ జరిగింది. సైన్యం ఎప్పటినుంచో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తూ వస్తోందట. బీజేపీ హయంలో అదికూడా ఏలుతున్ననవారికి కీర్తి తీసుకురాగలిగే అంగడి సరుకైపోయింది. డిమానిటైజేషన్ని మీడియా రిపోర్ట్ చేసిన విధమైతే పరమ చండాలం. ఆర్బీఐకూడా  చెప్పని విషయాలను ప్రచారంచేసి ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడిన ఛానళ్ళు ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ ఉన్నాయి. మోదీ ఏంచేసినా రైటేనంటూ తందానతాన పాడే ఈ మీడియా, బీజేపీ మిగిలినవాళ్లమీద మాత్రం విరుచుకుపడిపోతుంది.

I am a Troll అనే పుస్తకంలో బీజేపీ ఆన్లైన్ వింగ్ చేసే నికృష్టపు పనుల్ని (వాళ్లకు నచ్చనివార్ని హత్యచేస్తామని రేప్ చేస్తామని బెదిరిస్తారు), అలాంటి నికృష్టుల్ని గౌరవనీయులన ప్రధాని ఇంటికి పిలిచి టీపార్టీ ఇవ్వడాన్ని, వివరించారు. అదే పుస్తకంలో ట్వీట్లు వైరల్ చెయ్యడంద్వారా, ప్రముఖంగా కనబడడానికి వేసే కుయుక్తుల్ని కూడా వివరించారు (అన్నట్లు... ఒక ఐదు డాలర్లు మనవి కావనుకుంటే, రెండులక్షల ఫాలోయర్లను సమకూర్చే సంస్థలు సామాన్య ప్రజానీకానిక్కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక ముప్పై డాలర్లకు 10 లక్షల లైకులు ఇచ్చే సంస్థలుకూడా ఉన్నాయి).ఒకానొక శుభదినాన మోదీ అమెరికా వెళ్ళినప్పుడు, దాన్ని పొగుడుతూ పోస్టైన ట్విట్టర్ పోస్టులు, మొదీ ప్రయాణాన్ని, ప్రపంచంలోనే అత్యంత పాపులర్ పోస్టుగా మార్చేశాయట. కొంచెం లోతుగా విచారించగా, ఆ పోస్టులన్నీ ధాయ్‌లాండ్ నుంచి పోస్టుచేయబడ్డవట. అదే సమయంలో ధాయ్ రాజుగారు అనారోగ్యంతో ఉంటే, దాన్ని వదిలేసి, మోదీ ప్రయాణం గురించి తెగ ఇదైపోతున్నారని అనికోవాలేమో అంటారొక విశ్లేషకుడు.