Tuesday, January 7, 2020

Miss Granny (2014)



Oh! Baby సినిమాకి మాతృక ఈ కొరియన్ సినిమా. నచ్చడానికి నాకు తెలుగు సినిమానే నచ్చింది.

డైరెట్రు మరీ సీన్లను మక్కీకి మక్కీ దించేశాడు స్వామీ (ఆఖరికి పాటల్లోకూడా). చాలాచోట్ల డైలాగులూ అవే. ఇక కేమెరా స్టిల్సా? అవీ కాపీనే. పాటల్ని కూడా తర్జుమాచేసి తగలెయ్యలేదు సంతోషం! ఆమధ్య వచ్చిన పిల్లజమీందార్ సినిమాకూడా ఒక కొరియన్ సినిమాకు (A Millionaire's First Love) తెలుగుసేతనే. కానీ అందులో కాన్సెప్ట్ మాత్రం తీసుకొని వీళ్లు కధల్లుకున్నారు. Oh! Babyలో మాత్రం సీన్లు, డైలాగులు దించేసారు. బహుశా స్క్రిప్టు లేకుండా కేవలం ఆ సినిమా DVDనే చూపించి "ఇలా నటించాలి" అని చెప్పుంటారు. 

కాపీ కొట్టినవి ఇవీ:

  1. రావు రమేష్ geriatry క్లాసు (కొరియన్ సినిమాలో దీన్ని ageism మీద చర్చలా చూపించారు) అందులో విద్యార్ధులు చెప్పే సమాధానాలు. అసలీ సీను ఎందుకుంది సినిమాలో?
  2. చనిపోయాక బాగా కనబడాలని ఫోటో స్టూడియో కెళ్ళడం. ఫోటో ద్వారా కుర్రపిల్లైపోవడం.
  3. ఆవిడ కుర్రపిల్లైపోయాక  ధనరాజ్ గాగుళ్ళలో తన ప్రతిబింబాన్ని  చూసి ఆవిషయం తెలుసుకొని షాకవ్వడం.
  4. వృధ్ధాశ్రమంలో గెంతులు, తనను తాను ముసలాళ్ళమధ్య చూసుకొని inspire అవ్వడం.
  5. సమంత గొడుగేసుకొని తిరగడం. Come on!! ఎండలో గొడుగులేసుకొని (అవేనండీ parasols) ఎంతమంది తిరుగుతున్నారు హైదరాబాదులో? మనకు parapluలేగానీ parasols ఎక్కడ?
  6. మనవడు ఏదో చెప్పబోతున్నాడనుకొని over react అవ్వడం. ఇదిమాత్రం దించేశారు.
  7. ఏదో దురుద్దేశ్యంతో తన వెంటబడుతున్నాడని అనుకున్న టీవీ "అబ్బాయ్"ని పోలీసులకు పట్టించడం. ఇదీ దించేశారు. కాకుంటే తెలుసులో సొతకాయతో కొడుతుంది, కొరియన్‌లో చేపను కత్తిలా వాడుతుంది.
  8. మెచ్చుకోలుగా పిర్రమీద కొట్టడం.
  9. ఆ "ముసలోడు" లెదర్ జాకెట్, bandana వేసుకొని మోటారు సైకిల్‌పై రావడం, సినిమా చివర్లో అదే "ముసలోడు" కుర్రాడైపోవడం.
  10. బేబీ కొడుకింటికెళ్ళినప్పటి ప్రవర్తన. దీన్నికూడా చేపలకూరతో సహా దించేసారు. ఆఖరుకి ఆ పాత్ర ఎండలో నుంచుని ఉక్కపోస్తుండగా, ఆ కుర్రాడు తొందరగా తలుపుతీయలేదని విసుక్కునే సీనుకూడా.
  11. ATM లోంచి గొడుగడ్డం పెట్టుకొని డబ్బు withdraw చెయ్యడం. బహుశా ఈ ఒక్క సీనుకోసమేనేమో ఆ పాత్ర అలా గొడుగేసుకొని తిరుగుతుంటుంది.
  12. 'చంటి' ఇంటికొచ్చినప్పుడు కొడుకు బూట్లు తుడవడం, ఆ సమయంలో రాంజెంద్ర ప్రసాద్ చెప్పే డైలాగులు. ఆఖరుకి "మీ అమ్మకు నేను సరిపోనెమిట్రా" కూడా. ఖర్మ ఖర్మ.
  13. ఆ టీవీ "అబ్బాయ్" ఇంట్లో సమంత ప్రవర్తన, చెప్పే డైలాగులు అన్నీ కాపీనే. "మగాడిలా కాపురం చెయ్యాలి" దగ్గరనుంచి,  జోలపాడ్డం వరకూ. 
  14. ఇక "ఆకాశంలోన" పాటలో కొరియన్ సినిమాలోని సీన్లను యధాతధంగా వాడేసారు. సిగ్గులేకపోతేసరి! ఆ పాట మొదలవ్వడంకూడా మైకును కోజప్లో చూపిస్తూ మొదలవుతుంది.  ఇది కాపీకళకే పరాకాష్ట.
  15. మనవడు అలా వాళ్ళింటో పడుకుంటున్నావంటగా అని అడగడమూ, నాయనమ్మ మనవడి చమ్డాలు వొలిచెయ్యడమూ, గుండుసూదితో ముసలాడి పరిశోధన, కూతురు గుండెలు బాదుకోవడమూ, అంతకు ముందే ముసలాడు ఎలాగైనా కుర్రాడైపోవాలని ఇంట్లో కసరత్తులు చెయ్యడమూ  అన్నీ కాపీనే.
  16. ఇక ఇన్ని చేశాక చివరి సీన్లు మాత్రం తప్పుతాయా? Blood tranfusion, అక్కడ ముసలాడు కుర్రపిల్లని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడటము, దాన్ని కొడుగ్గారు వినడమూ, డైలాగులూ అన్నీనూ.


వీళ్ళు మళ్ళీ మనకి పైరసీ తప్పు అని సొల్లుకబుర్లు చెబుతారు. వీళ్ళు మాత్రం మాతృకకి కనీసం క్రెడిట్‌కూడా ఇవ్వకుండా డైలాగులు, సీన్లు పైరసీ చెయ్యొచ్చు. మనమ్మాత్రం మంచి బాలుళ్ళలా ఫ్యామిలీతో సినిమా హాలుకెళ్ళి మనల్ని మనం వాయించుకోవాలి.