Sunday, December 30, 2018

అనువాదాలు కాదు, అసలు ప్రతులు చదవండి!

ఎవరైనా రామాయణాన్ని విమర్శించినా, అశ్వమేధ యాగంలాంటి యాగపధ్ధతుల్లోని అశ్లీలతను ఎత్తిచూపినా, వేదాల్లోని విషయాల్ను విమర్శించినా, ఒకప్పటి ఆహారపు అలవాట్లలో గోమాంసభక్షణ తప్పనిసరని ఋజువుచేస్తూ ఒక పుస్తకం రాసినా, ఈ బ్యాచ్ "అనువాదాలు కాదు, అసలు ప్రతులు చదవండి" అంటుంది. ఈ గుంపు ఉద్దేశ్యమల్లా ఎవడికీ అఖ్ఖర్లేని అ దిక్కుమాలిన సంస్కృతాన్ని నేర్చుకోవడంలో ఆయా విమర్శకులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటుంటే చూసి ఆనందించాలి, ఆ విధంగా ఆయా విషయాలమీద విమర్శ లేకుండా చెయ్యాలి అని. పోని సంస్కృతం ఒకడు నేర్చుకొని వాడు అనువదించాడనుకుందాం, ఇప్పుడు నువ్వో, నేనో మళ్లీ నేర్చుకొని, అర్ధంచేసుకు చచ్చేది అప్పటికే అనువదించబడిన విషయమే కదా! మరి ఆమాత్రానికి reinventing the wheel ఎందుకు? అయినా ఉనికిలోనే లేని సంస్కృతం ఎవడిక్కావాలి? పోనీ ఇంతలా అసలు ప్రతులపై ప్రేమలు ఒలకపోస్తున్న మేధావులందరూ అనువాదాలుకాదూ చదివి కాదూ భక్త్యోన్మాదంతో ఊగిపోతున్నది? వీళ్లందరూ మాత్రం అసలు ప్రతులు చదివినారా?

మరి ఈ పుణ్యాత్ములు మార్కిజాన్ని విమర్శించాలంటే ముందుగా జర్మన్ నేర్చుకొని, ఆ తరువాత జర్మన్ భాషలో Das Kapital పుస్తకాన్ని చదివి, ఆపై తీరిగ్గా విమర్శిస్తారా? లేదే! మహా ఉంటే అదే పుస్తకాన్ని, ఇంగ్లీషులోనో లేదా వారి మాతృభాషలోనో చదువుతారు. ఇంకొందరు ప్రబుధ్ధులు వికీపీడియానో, ఇంకొకరు రాసిన బ్లాగునో చదువుతారు. మరి ఎందుకు మతగ్రంధాలకే ఇన్ని భాషాపరమైన నియమాలు? ఖురాన్ను విమర్శించడానికి అరబిక్కూ, బైబిల్ను విమర్శించడానికి యూదుభాష (లేదా పురాతన గ్రీకు) నేర్చుకు తీరాల్సిందే అనైతే వీరు అనుకోరుగానీ, సంస్కృతం నేర్చుకోవాలని ఒక ఉచిత సలహా పడేస్తారు. ప్రతిదాన్నీ ఒరిజినల్సులోనే చదివేట్టైతే, ఇంటర్ కాంటినెంటల్ వంటకాలు చెసే షెఫ్ఫులందరూ బహుభాషాకోవిదులుగా మారాలి ముందుగా!