Monday, January 4, 2021

Unbelievable - Netflix


Foster Homeలో నివసించే Maria Adler అనే ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఒకానొక రోజున తనపై ఉదయం నాలుగింటికి జరిగిన అత్యాచారాన్ని గురించి పోలీసులకు రిపోర్టు చేస్తుంది. వెంటనే వచ్చిన పోలీసతను "ఏం జరిగింది?" అనడుగుతాడు. ఈ అమ్మాయి ఏంజరిగిందో చెబుతుంది. ఆ పోలీతను అక్కడుండగానే వచ్చిన పోలీసు డిటెక్టివ్ మళ్ళీ "ఏం జరిగింది?" అనడుగుతాడు. "ఇప్పుడే చెప్పానండీ ఈ పోలీసతనికి" అనంటుంది. ప్రాసెస్ ప్రకారం మళ్ళీ ఇతనికీ ఏంజరిగిందో చెబుతుంది. ఆ అమ్మాయిని పరీక్షలకోసం హాస్పిటలుకు పంపిస్తారు. పరీక్షలన్నీ అయ్యాక అక్కడుంటే డాక్టరమ్మ మరోసారి "ఏం జరిగింది?" అనడగుతుంది తాముకూడా రికార్డుల్లో రాసుకోవడానికని. ఈ అమ్మాయి మళ్ళీ చెబుతుంది. కొన్నాళ్ళకి తిరిగొచ్చిన డిటెక్టివు "బాధితులు కొన్నిసార్లు ఆరోజున గుర్తురాని కొన్ని విషయాలు కొన్నిరోజుల తరువాత గుర్తుతెచ్చుకుంటారు" కాబట్టి ఆరోజు "ఏం జరిగింది?" అని మళ్ళీ అడుగుతాడు. ఈ అమ్మాయి మళ్ళీ చెబుతుంది. అప్పుడు విచారణ మొదలెట్టిన డిటెక్టివు అమ్మాయి చెప్పిన కొన్ని విషయలు ప్రతిసారీ మారిపోతూ ఉన్నట్లు తెలుసుకుంటాడు. 

ఆ అమ్మాయి మాజీ foster mother చెప్పిన దాని ప్రకారం ఈ అమ్మాయికి attention seeking nature ఉంది అని తెలుసుకొని. తనకు DNA ఆధారాలు, వేలిముద్రలు దొరక్కపోవడానికి కారణం ఇదా అననుకొంటాడు. ఈ అత్యాచారం కధంతా ఈ అమ్మాయి అల్లిందే అని అర్ధంచేసుకుంటాడు. ఈసారి ఇంకో డిటెక్టివుతో కలిసి అమ్మాయిని విచారణకు పిలిచి మరోమారు "ఏం జరిగింది?" అనడుగుతాడు. ఈ అమ్మాయి ఈసారి చెప్పింది ఇంతకు ముందు చెప్పినదాంతో పోలట్లేదని గమనించి. "ఇదంతా నా కల్పన మాత్రమే, నామీద ఏ అత్యాచారమూ జరగలేదు" అని స్టేట్‌మెంటుమీద సంతకం చెయ్యమంటాడు. ఈ అమ్మాయి కావాలంటే lie detector పరీక్షలు నిర్వహించుకోమంటుంది. డిటెక్టివేమో ఒకవేళ అందులో నువ్వు తప్పితే మాసమయాన్ని వృధా చేసినందుకు నీమీద కేసుపెట్టాల్సొస్తుంది జాగ్రత్త అని బెదిరిస్తాడు. ఆ దెబ్బతో Marie డిటెక్టివు కోరినట్లు రాసిచ్చి సంతకం పెడుతుంది.

ఇక అప్పటినుండీ Marieకి కష్టాలు మొదలవుతాయి. తమను అనవసరమైన భయానికి గురిచేసినందుకూ, బాధితురాలని భావించి తనమీద కురిపించిన ప్రేమనూ, జాలినీ, అప్యాయతనూ ఇలా దురుపయోగించినందుకుగానూ అందరు స్నేహితులూ ఆమెను దూరంపెట్టేస్తారు. తన పాత foster parents కూడా తమ ఇంట్లో ఒకరాత్రి ఉంచుకోవడానికి ఇష్టపడరు - ఆ అమ్మాయి తమమీద ఏ కధలు చెబితే ఎక్కడ తమ పరువు పోతుందోనని. సరిగా Marie ఉద్యోగంలోనూ కష్టాలు ఎదురవడంతో ఇక తప్పదనుకొని తనే ఆ సూపర్‌మార్కెట్లో ఉద్యోగమ్మానేస్తుంది. ఇటుపక్క ఉంటున్న foster homeలోనూ కొత్త ఆంక్షలు విధించబడతాయి. 

ఇవి చాలవన్నట్లు మూలిగేనక్కమీద తాటిపండులా తప్పుడు రిపోర్టు బనాయించి ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినందుకుగాను కేసేస్తారు. అప్పుతెచ్చిన డబ్బుతో లాయరు సహాయంతో వాదించ ప్రయత్నించి, చివరకు కోర్టులో తనదే తప్పని ఒప్పుకొని లెంపలేసుకుంటుంది. కోర్టువారు కొన్నిరోజులు ఫలానా కౌన్సిలరుదగ్గర ఒక గంటసేపు చికిత్స చేయించుకో అదే శిక్ష అని తీర్పిస్తుంది. అప్పుడు... అమ్మాయి నమ్మకాన్ని చూరగొన్నాక ఆ కౌన్సిలరమ్మ "Marie... ఇలాంటి అబధ్ధమెవరూ ఆడరమ్మా, ఒకవేళ ఆడినా అందులో ఎంతో కొంత నిజం ఉండకపోదు, నాప్రయత్నమల్లా నీకేం జరిగిందో తెలుసుకొని నీబాధను అర్ధం చేసుకోని సాంత్వన కలిగించడమో లేదా అందులో కొంత బాధను తగ్గించడమో చేయాలని నా ప్రయత్నం. అయినా ఏం జరిగిందో చెప్పాలని నీకు ఇష్టం ఉంటేనే నాకు చెప్పు" అనడుగుతుంది. అప్పుడామెకు Marie జరిగిందేంటో ఏడోసారి వివరిస్తుంది. నిర్ఘాంతపోయిన ఆవిడ కన్నీళ్ళతో "నీమీద అత్యాచారం ఒకసారి కాదు తల్లీ రెండుసార్లు జరిగింది.  అయినా నీపై ఏ అఘాయిత్యమూ జరగలేదని నువ్వెందుకలా అబద్ధమాడేవు?" అనడుగుతుంది. దానికి Marie ఇచ్చే సమాధానం Marie నోటినుంచే వినాలి.

ఇదిలా సాగుతూ ఉండగా. ఇంకో కౌంటీలో జరిగిన ఇలాంటిదే అత్యాచారాన్ని పరిశోధిస్తున్న ఒక డిటెక్టివిణి అనుకోకుండా ఇలాంటిదే మరో అత్యాచారాన్ని పరిశోధిస్తున్న మరో డిటెక్టివిణిని కలవడంతో కధ మలుపు తిరుగుతుంది. తమకు DNA ఆధారాలు, వేలిముద్రలు దొరక్కపోవడానికి కారణం రేపిస్టుకి కాస్త పోలీసులు పనిచేసే విధానం గురించి తెలిసి ఉంటుందని, ఆధారాల ప్రకారంచూస్తే వాడు సైన్యంలోకూడా పనిచేసుంటాడనీ అర్ధంచేసుకొని, అహరహం శ్రమిస్తారు. ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా దేశం గంగవెర్రులెత్తకపోవడానికి కారణం ఒక కౌంటీ పోలీసులు ఇంకో కౌంటీ పోలీసులతో సమాచారాన్ని పంచుకోకపోవడమేననీ అర్ధం చేసుకున్నాక FBIతో కలిసి పనిచేయడం మొదలెట్టాకగానీ తాము వెదుకుతోంది 30 మందిని అత్యాచారంచేసిన ఒక రాక్షసుడికోసం అని అర్ధం అవుతుంది! చివరకు ఆదరిద్రుణ్ణి పట్టుకుంటారు. ఆ పట్టుకున్నాక Marie కేసును పరిశోధించిన డిటెక్టివోత్తముడికో ఫోనుకొట్టి "నాయనా మీరు మూసేసిన కేసు ఆధారాలు మాదగ్గరున్నాయి, వచ్చి చూసుకుపో" అని చెబుతారు. వచ్చి చూసుకున్న ఆడిటెక్టివు చాలా సిగ్గుపడతాడు. సరాసరి Marie దగ్గరకి వెళ్ళి కోర్టు ఖర్చులకుగానూ Marieకైన 500 డాలర్లూ చేతిలోపెట్టి, క్షమించమనడిగి అలాగే పోతాడు. Marie ఈసారి వూరిమీద కేసేసి 1,50,000 డాలర్లు ఊరినుంచి రాబడుతుంది. చివరకు తను డ్రైవింగ్ లైసెన్సు సంపాదించినప్పుడు మొత్తం కధలో తొలిసారిగా అప్పుడు నవ్వుతుంది. ఒక జీపు కొనుక్కొని నగరాన్ని విడిచి చక్కా వెళ్ళిపోతుంది.

అహ ఆ రాక్షసుడి విషయానికొస్తే, వాడి దాష్టీకానికి గురైన వాళ్ళలో పన్నెండేళ్ళ Marie నుండి  డెబ్భయ్యేళ్ళ ముసలావిడ వరకూ అందరూ ఉంటారు. ఈ ముప్ఫై కూడా వీళ్ళకందినవిమాత్రమే! వాడి దగ్గర ఇంకా ఒక encrypted hard driveను decrypt చెయ్యడం పోలీసులకు సాధ్యమేకాదు. మొత్తానికి వాడికి మూడొందల ఇరవైయ్యైదేళ్ళు మరియు మరో అర్ధజీవితకాలం కైలుశిక్షవేస్తారు.

--------------------------------------------------------------------------------------------------------------------------------


పోలీసులు processతో పాటు  బాధితురాలి పట్ల కొంత దయతో(compassion) వ్యవహరించాలి అనేది కధ. దాంతోబాటు అత్యాచారం అనేది బాధితులు జీవితాంతం గుర్తుంచుకోవాలనుకొనే జ్ఞాపకం కాదు. దాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవాలని వాళ్ళోపక్క ప్రయత్నిస్తుంటే వ్యవస్థ ప్రతిరోజూ ఆజ్ఞాపకాల్ని గుర్తుచెయ్యడం ఎద్దు పుండు కాకికి ముద్దు లాగా ఉంటుందని చెప్పడం, స్టేట్మెంట్లలో చిన్నచిన్న విషయాల్ని Sherlock Holmes మాదిరి పరిశీలించి బాధితురాలు చెప్పినదాంట్లో అసంబద్ధతలున్నాయి కాబట్టి ఇదంతా ఆవిడ కపోలకల్పన అని తీర్మానించెయ్యకూడదు అనేది అసలు కధ.


నేను గమనించిందేమిటంటే Marie తమను manipulate చేసింది అనుకొని తన స్నేహితులు దూరమౌతారే తప్ప Marie అలా అత్యాచారానికి గురైందని తమకు తెలిసినప్పుడు అందరూ Marieకి బాసటగా నిలుస్తారు. అదే "స్త్రీలను పూజించే, తల్లిలా భావించే" పవిత్రభారతదేశంలో మాత్రం బాధితురాలిని వీలైన విధంగా పొడుచుకుతింటారు. ఆవిడదే తప్పని ధియరీలు చెబుతారు. రేపిస్టు వెధవలకి సపోర్టుగా ర్యాలీలు తీస్తారు. పవిత్ర భారతదేశంలో స్త్రీ కేవలం సెక్స్ చేయడానికీ, సేవలు చెయ్యడానికీ పనికొచ్చే ఒక మాంసం ముద్ద. దాన్ని మొగుడే తొలిసారి పొడుచుకు తినెయ్యాలి. అలాక్కుదరపోతే అది కుళ్ళిపోయిన మాసంముద్ద. దాన్ని వదిలించేసుకోవాలి. కాదంటే వీలైనంతగా అవమానించి దానంతట అది ఆత్మహత్య చేసుకొనేలా చెయ్యాలి. పవిత్రత అనేదాన్ని స్త్రీల యోనుల్లో పెట్టేసే ఈ దరిద్రపుగొట్టు పద్ధతికే "సంస్కృతి" అని గొప్పపేరు పెట్టుకొని గర్వపడతారు. అంతే!